బాలకృష్ణ ఎవరు? నందమూరి తారక రామారావు కుమారుడు. నాగార్జున ఎవరు? అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు. మరి, వెంకటేష్? దగ్గుబాటి రామానాయుడి కుమారుడు. ఒక్క చిరంజీవిని మినహాయిస్తే తెలుగు తెరను ఏలిన ఓ తరం హీరోల్లో ముగ్గురు సినిమా నేపథ్యం కల కుటుంబం నుంచి వచ్చారు. సినీ వారసులే. ముగ్గురిలో వెంకటేష్ మాత్రమే నిర్మాత కుమారుడు. మిగతా ఇద్దరి తండ్రులు హీరోలే.
నెక్స్ట్ జనరేషన్ చూడండి! పవన్‌కల్యాణ్? చిరంజీవి తమ్ముడు. మహేశ్‌బాబు ఎవరు? సూపర్‌స్టార్ కృష్ణ కుమారుడు. ప్రభాస్? కృషంరాజు సోదరుని కుమారుడు. జూనియర్ ఎన్టీఆర్? సీనియర్ ఎన్టీఆర్ మనవుడు, హరికృష్ణ కుమారుడు. రామ్‌చరణ్? చిరంజీవి కుమారుడు. అల్లు అర్జున్? అల్లు అరవింద్ కుమారుడు. రానా? వెంకటేష్ అన్న, నిర్మాత డి. సురేష్ బాబు కుమారుడు. రామానాయుడి మనవడు. ఈ తరంలో రవితేజ, తర్వాతి తరంలో నానీని మినహాయిస్తే మిగతా అందరికీ సినిమా నేపథ్యం వుంది. అల్లు అర్జున్, రానా తప్ప మిగతా అందరూ హీరోల వారసులే. బన్నీ తండ్రి నిర్మాత, మావయ్య మెగాస్టార్. యంగ్ జనరేషన్లో రామ్ (నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ సోదరుని కుమారుడు), శర్వానంద్ (రామ్ కజిన్), వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తదితరులు సైతం వారసులే.
ఇప్పటివరకూ చెప్పిన జాబితా గమనిస్తే మెజారిటీ హీరోలు… అంతకు ముందు తరం తెలుగు తెరను ఏలిన హీరోల వారసులే కనిపిస్తారు. ఎక్కడో అరకొరగా నిర్మాతల తనయులు కనిపిస్తారు. హీరోలుగా సక్సెస్ అయిన ఒక్క దర్శకుడి కుమారుడు కూడా కనిపించడు… గోపీచంద్ తప్ప! ఒకప్పుడు విప్లవ చిత్రాలతో తెలుగులో ట్రెండ్ సృష్టించిన టి. కృష్ణ కుమారుడు గోపీచంద్. తండ్రి మరణం తరవాత సినిమాల్లోకి వచ్చాడు. ముందు హీరోగా ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు. అక్కణ్ణుంచి విలన్ రోల్స్ చేసి సక్సెసులు అందుకుని, మళ్లీ హీరోగా టర్న్ అయ్యాడు. సక్సెస్ అయ్యాడు. అతను తప్ప హీరోగా సక్సెస్ అయిన మరో దర్శకుని కుమారుణ్ణి వెతకడం కష్టమే.
హీరోల కుమారులు హీరోలు అవుతున్నారు. అందులో తప్పేం లేదు. వారసత్వంగా వచ్చిన అభిమానం అండతో చక్కటి పునాది వేసుకుని నిలదొక్కుకుంటున్నారు. మరి, దర్శకుల కుమారులు? హీరోలుగా ప్రయత్నిస్తున్నారు. కాని పెద్దగా సక్సెస్ అయిన దాఖలాలు తక్కువ. తనయుణ్ణి హీరోగా నిలబెట్టాలని ప్రయత్నించిన ప్రతి దర్శకుడికి సన్ స్ట్రోక్ తగిలింది. దర్శకరత్న దాసరి, దర్శకేంద్రులు రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, రవిరాజా పినిశెట్టి, ఎమ్మెస్ నారాయణ, తాజాగా పూరి జగన్నాథ్… ఎవరూ ఈ సన్ స్ట్రోక్‌కి అతీతులు కాదు. కుమారులను హీరోలుగా పెట్టి సినిమాలు నిర్మించి చేతులు కాల్చుకున్నవారే.
ఎన్టీఆర్, ఏయన్నార్ నుంచి నాగార్జున, వెంకటేష్ వరకూ రెండు తరాల హీరోలకు ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు దాసరి. ఆయనకి తీరని బాధ ఏదైనా వుందంటే… ‘కుమారుడు దాసరి కిరణ్‌కుమార్‌కి హిట్ ఇవ్వలేకపోయాను, హీరోగా నిలబెట్టలేకపోయాను’ అనేది ఒక్కటే. అది చివరికి ఆయనకు తీరని కోరికగా మిగిలింది. రాఘవేంద్రరావుదీ ఇంచు మించు ఇటువంటి పరిస్థితే. మీడియా మొఘల్ రామోజీ రావు నిర్మించిన ‘నీతో’ సినిమా ద్వారా రాఘవేంద్రరారావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. అది ప్లాప్. రెండేళ్ల తరవాత ఆయనే రంగంలోకి దిగి కుమారుణ్ణి హీరోగా పెట్టి ‘మార్నింగ్ రాగ’ నిర్మించారు. అదీ ప్లాపే. డబ్బులు పోయాయి. తరవాత ప్రకాష్ హీరోగా ట్రై చేయలేదు. అతను నటించిన రెండు సినిమాలను వేరే దర్శకుల చేతిలో పెట్టారు రాఘవేంద్రరావు. ఒకవేళ ఆయనే డైరెక్ట్ చేసుంటే పరిస్థితి వేరేలా వుండేదేమో. ఏది ఏమైనా చివరకి ప్రకాష్ కోవెలమూడి దర్శకుడిగా సెటిల్ అయ్యాడు.
చిరంజీవి మాస్ హీరోగా అవతరించడంలో దర్శకుడు కోదండరామిరెడ్డికి కీలక పాత్ర. ఇద్దరి కాంబినేషన్లో సుమారు 25కు పైగా సినిమాలు వస్తే… వాటిలో ఒకట్రెండు ప్లాప్ అంతే. చిరంజీవికి అన్ని విజయాలు ఇచ్చిన ఆయన కుమారుడు వైభవ్ రెడ్డికి ఓ విజయం ఇవ్వలేకపోయారు. వైభవ్ హీరోగా పరిచయమైన ‘గొడవ’కి కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. అది ప్లాప్. ఈతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమా తీయలేకపోతున్నానేమో అని రెండేళ్ల తరవాత జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో కోదండరామిరెడ్డి ‘కాస్కో’ నిర్మించారు. కొంత డబ్బులు పోగొట్టుకున్నారు. తరవాత సొంత ప్రయత్నాలు ప్రారంభించిన వైభవ్ తమిళంలో చిన్న హీరోగా పేరు తెచ్చుకున్నాడు. తనయుడు విక్రమ్‌ని హీరోగా పెట్టి ప్రముఖ హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ దర్శకత్వం వహించిన సినిమా ‘కొడుకు’. నిర్మాత వేరే వ్యక్తి అయినప్పటికీ… తెర వెనుక ఎమ్మెస్ కొంత పెట్టుబడి పెట్టారని, లాస్ వచ్చిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. దర్శకుల కుమారుల్లో నటుడిగా పేరు, విజయాలు అందుకున్నది ఒక్క ఆది పినిశెట్టి మాత్రమే. రవిరాజా పినిశెట్టి తనయుడు ఇతను. హీరోగా సక్సెస్ కాకున్నా… ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇతణ్ణి హీరోగా పెట్టి రవిరాజా పినిశెట్టి ఒక సినిమా నిర్మించారు. దానికి ఆయన పెద్ద కుమారుడు సత్యప్రభాస్ పినిశెట్టి దర్శకుడు. ఈ సినిమా పినిశెట్టి ఫ్యామిలీకి నష్టాలను మిగిల్చింది. ఈ జాబితాలో చేరిన మరో దర్శకుడు పూరి జగన్నాథ్. ఇవన్నీ చూస్తే దర్శకులకు సన్ స్ట్రోక్ తప్పదా? అనే అనుమానం కలుగుతోంది.
కుమారుణ్ణి హీరోగా నిలబెట్టడం కోసం పూరి జగన్నాథ్ చేసిన ప్రయత్నం ‘మెహబూబా’. దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలనూ ఆయనే భుజాన వేసుకున్నారు. సినిమా కోసం ఒక ఇంటిని అమ్మేశారు. సినిమా తీయడం దగ్గర్నుంచి మార్కెట్ చేయడం వరకూ ప్రతి అంశాన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఇంత కష్టపడి పని చేస్తే రిజల్ట్ రివర్స్‌లో వచ్చింది. పూరి పెట్టిన పెట్టుబడి తిరిగి రావడం కష్టమేనని బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి. ఈ డబ్బులు పూరికి లెక్క కాదు. ఎందుకంటే… ఒకప్పుడు నమ్మకస్తులు మోసం చేయడంతో ఇంతకు ఐదింతలు పోగొట్టుకున్నారు పూరి. మళ్లీ సంపాదించారు. ఇప్పుడు ఆయన దృష్టి అంతా కుమారుణ్ణి హీరోగా నిలబెట్టడం మీదే వుంది. చరిత్ర చూస్తే… హీరోలుగా సక్సెస్ అయిన దర్శకుల కుమారులు అరుదు. ఈ సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్తూ ఆకాష్ పూరి హీరోగా సక్సెస్ కావాలని ఆశిద్దాం!!