తెలంగాణా న్యాయవ్యవస్థలో ఏర్పడిన సంక్షోభాన్ని నివారించేందుకు గవర్నర్ నరసింహన్ చొరవ తీసుకొని, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్.బి.భోసలే, తెలంగాణా అడ్వకేట్ జనరల్ కే.రామకృష్ణారెడ్డితో చర్చించారు. ఈవిషయంలో చాలా ఆలశ్యంగానైనా ఆయన చొరవ తీసుకొన్నందుకు సంతోషించవలసిందే. న్యాయవాదుల డిమాండ్లు, హైకోర్టు విభజనలో ఎదురవుతున్న సాంకేతిక, రాజకీయ, చట్టపరమైన సమస్యల గురించి రామకృష్ణా రెడ్డి గవర్నర్ కి వివరించారు. ఆ తరువాత గవర్నర్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్.బి.భోసలేతో సమావేశమయ్యి ఇవే విషయాలు చర్చించారు. వారి సమావేశంలో ఏమి నిర్ణయాలు తీసుకొన్నారో తెలియదు కానీ సమావేశం ముగిసిన తరువాత ఉద్యోగులు, న్యాయవాదులు, జడ్జీలు అందరూ సమ్మె విరమించి తక్షణమే విధులలో చేరాలని లేకుంటే కేసుల విచారణ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించుకోవలసి వస్తుందని హెచ్చరించారు. ప్రత్యామ్నాయ మార్గాలంటే ఏమిటో ఆయన వివరించకపోయినా అది హెచ్చరికగానే భావించవచ్చు ఉద్యోగులు, న్యాయవాదులు, న్యాయమూర్తుల సస్పెన్షన్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని సూచించినట్లే భావించవచ్చు.
ఇక ఈ సమస్యలో రాజకీయ, చట్టపరమైన సమస్యలు, అవరోధాలు చాలా ఇమిడి ఉన్నప్పటికీ గవర్నర్ చేస్తున్న కృషి ఫలిస్తే ఈ సమస్యని తాత్కాలికంగా పరిష్కరించడం సాధ్యమే. భోసలే, రామకృష్ణా రెడ్డి నుంచి ఆయన సేకరించిన సమాచారాన్ని కేంద్రానికి నివేదించి, పరిస్థితులు వివరించినట్లయితే కేంద్రంలో కదలిక రావచ్చు. అలాగే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్.బి.భోసలేని ఒప్పించి ప్రాధమిక కేటాయింపులు, సస్పెన్షన్లపై ఇచ్చిన ఉత్తర్వుల్ని ఉపసంహరింపజేయవచ్చు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులని కూర్చోబెట్టి మాట్లాడితే హైకోర్టు విభజనపై ఒక నిర్దిష్ట ప్రకటన చేయించవచ్చు. తెలంగాణా ముఖ్యమంత్రి ద్వారా సమ్మెని విరమింపజేయవచ్చు. కనుక ఆయన ప్రయత్నాలు ఫలిస్తే త్వరలోనే ఈ సమస్య సమసిపోవచ్చు. అయితే ఈ సమస్యలన్నిటికీ మూలకారణం హైకోర్టు విభజన జరుగకపోవడమే కనుక ఆ సమస్యని పరిష్కరించడం చాలా అవసరం. లేకుంటే మళ్ళీ ఏదో ఒక రోజు ఇవే సమస్యలు పునరావృతం కావడం తధ్యం. అప్పుడు గవర్నర్ కూడా ఏమీ చేయలేకపోవచ్చు. కనుక కేంద్రప్రభుత్వం తక్షణమే మేల్కొని హైకోర్టు విభజనకి ఏర్పాట్లు చేయడం మంచిది.