ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే సర్వాధికారం. గవర్నర్ పేరు మీద ప్రభుత్వం నడిచినంత మాత్రాన ఆయనకు ఎలాంటి అధికారాలు ఉండవు. ఈ విషయం రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. కానీ కొంత మంది గవర్నర్లు తనదే ప్రభుత్వం అని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న పార్టీ వ్యతిరేక పార్టీల ప్రభుత్వాలు రాష్ట్రాల్లో ఉంటే వాటికి గవర్నర్లు చుక్కలు చూపిస్తారు. అదే పార్టీ ప్రభుత్వాలు రాష్ట్రాల్లో ఉంటే మాత్రం గవర్నర్ ఉనికి కూడా కనిపించదు. ఇలాంటి రాజకీయాల గవర్నర్లకు చెక్ పెట్టాల్సిందే.
అతికి పరాకాష్ట తమిళనాడు గవర్నర్
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ అతికి పరాకాష్టగా ప్రవర్తిస్తారు. ఆయన ప్రతి ప్రభుత్వ నిర్ణయానికి అడ్డం పడతారు. తమిళనాడు ప్రభుత్వం తన పరిధిలో లేని చట్టాలను చేస్తే ఆ విషయం చెప్పవచ్చు కానీ.. ప్రతీ దాన్ని ఆయన రాజకీయం చేసి.. బిల్లులు పెండింగ్ లో పెడతారు. రాష్ట్ర గీతాన్ని మారుస్తారు. అసెంబ్లీ ప్రసంగాన్ని కూడా ఆయన మార్చేసుకుంటారు. ఆయన అతి కారణంగా గవర్నర్ స్పీచ్‌ను కూడా బహిష్కరించే సన్నివేశాలు తమిళనాడులో కనిపించాయి. ఆయన బిల్లులను రెండో సారి పంపినా ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపడంతో సుప్రీంకోర్టు అభిశంసించింది. ఇప్పుడు ఆయన తుడుచుకుని హాయిగా గవర్నర్ పోస్టులో ఉంటే ఇక విలువలకు అర్థం ఏముంది ?
గవర్నర్ వ్యవస్థ కేవలం స్టాంప్
భారత రాజ్యాంగంలో గవర్నర్ వ్యవస్థ కేవలం స్టాంప్. అసలు అవసరం లేదన్న అభిప్రాయాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కేంద్రంలో ఉన్న పార్టీలకు గవర్నర్లు ఆయుధాలుగా మారుతున్నారు. బెంగాల్ లో గవర్నర్ గా ఉన్నప్పుడు ప్రస్తుత ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్ వ్యవహారం అందరికీ గుర్తుండి ఉంటుంది. ఇప్పుడు గవర్నర్ గా ఉన్న సీవీ ఆనందబోస్ గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. అక్కడ మమతా బెనర్జీ ప్రభుత్వం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తమిళిసై సౌందరరాజన్ వ్యవహారం కూడా వివాదాస్పదమయింది. ఆమె కారణంగా బీఆర్ఎస్ రెండు ఎమ్మెల్సీలను కోల్పోయింది. రెండో సారి సిఫారసు చేసి ఉంటే తప్పక ఆమోదించాల్సి వచ్చేది కానీ కేసీఆర్ సిఫారసు చేయలేదు అది వేరే విషయం. బీజేపీతో సంబంధం లేని కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఉన్న చోట్ల గవర్నర్లు రెచ్చిపోతున్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు.
తప్పు చేసిన గవర్నర్లు వైదొలగాల్సిందే !
రాజ్యాంగంలో గవర్నర్లకు ఉన్న విధులు, హక్కుల గురించి ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందరికీ తెలుసు. తప్పు చేస్తున్నారని గవర్నర్లకూ తెలుసు. కానీ వ్యవస్థల్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకునే అలవాటు ఉన్న రాజకీయం కారణంగా వారు అలా చేస్తున్నారు. ఇలా రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారికి రాజ్యాంగపదవుల్లో ఉండే అర్హత ఉండదు. ఇలాంటిగవర్నర్లను వెంటనే తొలగించాల్సిందే.