ముందు కొరటాల శివ, తర్వాత సతీష్ వేగేశ్న, వెనుక దేవి ప్రసాద్… తెలుగు దర్శకులు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం గళం వినిపించారు. రాజకీయాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. మూడ్రోజుల ముందు “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోదీ చేసిన ప్రామిస్ గుర్తు చేసి, మనమంతా ఆయన్ను మనిషిని చేద్దాం” అని దర్శకుడు కొరటాల శివ ప్రధాని మోదీకి ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసిన విషయం విదితమే. అల్లరి నరేష్ హీరోగా ‘కెవ్వు కేక’, ఆర్యన్ రాజేష్ హీరోగా ‘లీలామహల్ సెంటర్’ తదితర సినిమాలు తీసిన దర్శకుడు దేవి ప్రసాద్ పెన్ గన్ నుంచి ‘మాట తప్పిన రాజకీయాలను అడుసులోకి తొక్కు… ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ స్లోగన్ వచ్చింది. ఇక, ‘శతమానం భవతి’ చిత్రదర్శకుడు సతీష్ వేగేశ్న ఫేస్బుక్లో ఆయన ఆవేశాన్ని అక్షరాలుగా మలిచి కవితాత్మకంగా రాశారు.
ఫేస్బుక్లో సతీష్ వేగేశ్న పోస్ట్:
తుపాకి గుండుకు గుండె ఎదురొడ్డిన
ఆంధ్రకేసరి ధైర్యానికి వారసులం…
తెల్లవాళ్లను మూడు చెరువుల నీళ్లు తాగించిన
అల్లూరి సీతారామరాజు పోరాటానికి వారసులం…
ఢిల్లీ పడగొడితే తొడకొట్టి నిలబడిన
తెలుగుజాతి ఆత్మగౌరవం నందమూరి తారకరామారావు వారసులం…
సహనంగా ఉన్నామని అలుసుగా చూడొద్దు.
ఓర్పుగా ఉన్నామని తేలికగా తీసేయొద్దు.
మాట తప్పడం మీకు చేతకావచ్చు…
మడమ తిప్పడం మాకు చేతకాదు.
ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేసిన ఏ పార్టీ
బ్రతికి బట్టకట్టదు, మేం కట్టనివ్వం.
సిద్ధంగా ఉండండి
చాలా రుచి చూపిస్తాం తట్టుకోలేనంతగా!
సినిమాల్లో హీరోల కోసం పంచ్ డైలాగులు రాయడం, వెండితెర మీద మాటల తూటాలు పేల్చడం మాత్రమే కాదు. అవసరమైతే తమను ఆదరిస్తున్న ప్రజల కోసం గొంతు వినిపించే దమ్ముందని దర్శకులు ప్రూవ్ చేసుకున్నారు. అదే సినిమాల్లో ప్రజల పక్షాన పోరాడే నాయకులుగా, మహోన్నత ఆశయాలు కలిగిన మంచి మనుషులుగా కనిపించే హీరోలకు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం మాట్లాడడానికి నోరు రావడం లేదు. సోషల్ మీడియాలో ట్వీట్ లేదా పోస్ట్ చేయడానికి మనసు ఒప్పుకోవడం లేదు. ” తమిళనాడులో జల్లికట్టు సమస్య గురించి స్పందించిన వీరికి… ఐదు కోట్ల ఆంధ్రుల అభిలాష అర్థం కావడం లేదా?” – హీరోలకు, ఇండస్ట్రీ పెద్దలకు ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి ఈ ఒక్క ప్రశ్నే ఎదురవుతోంది. ఏం సమాధానం చెబుతారో?