ఎయిడెడ్ విద్యా సంస్థలను ఇస్తే ప్రభుత్వానికి ఇవ్వాలి లేకపోతే ప్రైవేటుగా నడుపుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో అనేక చోట్ల ఎయిడెడ్ విద్యా సంస్థలు ప్రభుత్వానికి ఇవ్వబోమని చెప్పి.. నడపలేక స్కూళ్లను మూసేస్తున్నాయి. దీంతో విద్యా సంవత్సరం మధ్యలో పిల్లలు రోడ్డున పడుతున్నారు. దీనిపై వరుసగా ఆందోళనలు పెరిగిపోతున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్ల మీదకు వస్తున్నారు. కాకినాడ, విశాఖల్లో జరిగిన ఆందోళనలు ముందు ముందు ఇతర చోట్ల కూడా చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమ ఆందోళనల్లో ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎయిడెడ్ విద్యా సంస్థలకు దశాబ్దాల చరిత్ర ఉంది. ఎంతో మంది సమాజం కోసం.. బడుగువర్గాలు, ఆడపిల్లల చదువుల కోసం ఎకరాలకు ఎకరాలు భూములు దానంగా ఇచ్చి ఏర్పాటు చేసినవి. ప్రభుత్వం ఎయిడ్ మాత్రం ఇస్తోంది. ముఖ్యంగా ఉపాధ్యాయులను ఇస్తోంది. మిగతా నిర్వహణ ట్రస్టులు చూసుకుంటున్నాయి. అందుకే ఎయిడెడ్ స్కూళ్లలో ప్రమాణాలు కాస్త ఎక్కువగా ఉంటున్నాయన్న అభిప్రాయం ఉంది. అయితే ప్రభుత్వ స్కూళ్లే బాగున్నాయని.. వాటి నిర్వహణలో లోపం ఏర్పడిందని.. అయితే ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి లేకపోతే ప్రైవేటుగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చేసింది.
ఎయిడెడ్ కాలేజీలు ప్రభుత్వానివిగానే సాగుతున్నాయి. అతి తక్కువ ఫీజులతో విద్యా సేవ అందిస్తున్నాయి. వీటి వల్ల ప్రభుత్వానికి కూడా భారం తగ్గుతుంది. అయితే ఇప్పుడు వాటిని ప్రభుత్వమే తీసుకోవాలని నిర్ణయించింది. వాటికి ఉన్న వేలాది ఎకరాలపై ప్రభుత్వ కన్ను పడిందన్న అనుమానాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే ప్రభుత్వానికి స్వాధీనం చేస్తే వాటిని ఏమి చేసుకోవడానికైనా హక్కు ప్రభుత్వానికి ఉంటుందని జీవోలోనే ప్రకటించారు. ఎయిడెడ్ విద్యా సంస్థలకు పెద్ద ఎత్తున ఆస్తులు ఉండటంతో చాలా సంస్థలు ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధపడటం లేదు. మూసుకోవడానికి సిద్ధపడుతున్నారు. దీనిపై హైకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఎయిడ్‌ను కొనసాగిస్తామని చెబుతున్నారు కానీ.. ఆచరణలో ఉండటం లేదు. కానీ బాధితులైన పిల్లలు, వారి తల్లిదండ్రులు మాత్రం రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నారు.