ఈ సంక్రాంతికి అందరి కళ్లూ… పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’పైనే. పవన్ – త్రివిక్రమ్ కాంబో అంటే ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. దానికి తోడు సంక్రాంతికి వస్తున్నాం అంటూ ముందే చెప్పేశారు. జనవరి 10 డేట్… ఎప్పుడో ఫిక్సయిపోయింది. కాటమరాయుడు ఫ్లాప్ తరవాత.. ఆకలిగొన్న సింహంలా ఉన్నాడు పవన్. అ.ఆ హిట్టుతో త్రివిక్రమ్ కూడా జోరుమీదే ఉన్నాడు. నాన్ బాహుబలి రికార్డులంటూ బద్దలు కొడితే… అది ఈ సినిమాకే సాధ్యం అని సినీ జనాలు కూడా నమ్ముతున్నారు. కేవలం పవన్ సినిమా కోసమే.. రంగస్థలం వాయిదా పడింది. ఆ స్థానంలో… ‘జై సింహా’ విడుదల అవుతోంది. ఇదీ పండగ సినిమానే అయినా… ఫస్ట్ లుక్ విడుదల చేయడం మినహా… ప్రమోషనల్ ఈవెంట్స్ ఏమీ మొదలెట్టలేదు. లెజెండ్ తరవాత సరైన కమర్షియల్ హిట్ లేని బాలయ్య.. గౌతమి పుత్ర శాతకర్ణితో కాస్త ఉపశమనం పొందాడు. అయితే ఆ ఆనందాన్ని పైసా వసూల్ ఆవిరి చేసింది. దర్శకుడు కె.ఎస్.రవికుమార్‌పై కూడా ఎవ్వరికీ ఎలాంటి నమ్మకాలు లేవు. దాంతో ‘జై సింహా’కి ఉండాల్సిన బజ్ కూడా లేకుండా పోయింది. ఇదేదో సెంటిమెంట్ సినిమా అంటూ.. ప్రచారం చేయడం మొదలెట్టి… అది కాస్త ఉసూరుమనిపిస్తున్నారు. దాంతో ‘అజ్ఞాతవాసి’కి జై సింహా కనీస పోటీ ఇస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాలయ్య సినిమా అటూ ఇటూ అయితే… పవన్ సోలో బ్యాటింగ్ మొదలైపోతుంది. కేవలం ‘జై సింహా’పై నమ్మకంతోనే రవితేజ ‘టచ్ చేసి చూడు’ ఈ సంక్రాంతి బరిలో దిగబోతోందని సమాచారం. ‘జై సింహా’ నుంచి ఓ టీజరో, ట్రైలరో వచ్చి… అది న భూతో అన్నట్టు ఉంటే తప్ప – ‘జై సింహా’ కోసం మాట్లాడుకోవడం మొదలెట్టరు సినీ జనాలు. మరి అలాంటి హంగామా ఏమైనా టీజర్లో ఉంటుందేమో చూడాలి.