తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని త్వరలో మంత్రి వర్గంలో తీసుకోవడం దాదాపు ఖాయమన్నట్టుగానే కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల్ని మార్చుతారా, ఆయన్నే కొనసాగిస్తారా అనే చర్చ తెరాస వర్గాల్లో మొదలైంది. ఈ క్రమంలో తెరమీదికి వస్తున్న పేరు… ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవిత. గత లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎంపీగా ఆమె ఓడిపోయిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచీ కవితకు ఏ బాధ్యతలు అప్పగిస్తారనేది సస్పెన్స్ గానే ఉంది. చివరికి, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నేతలందరూ పాల్గొన్నా, ఆమె పెద్దగా పట్టించుకోలేదు. అయితే, ఆమెను రాజ్యసభకు పంపించే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారనీ, తెరాస నుంచి బయటకి వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్న డీఎస్ పై చర్యలు తీసుకున్నాక… ఆ స్థానంలో ఆమె వెళ్తారనే చర్చ కొన్నాళ్లు నడించింది. ఎమ్మెల్సీని చేసి కేబినెట్ లోకి తీసుకుంటారా అనే చర్చా నడించింది.
ప్రస్తుతం కేటీఆర్ కి మంత్రి పదవి ఖాయమన్న చర్చ జరుగుతోంది కాబట్టి, పార్టీ బాధ్యతలు ఆమెకి అప్పగించే అవకాశం ఉందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఇప్పుడు వినిపిస్తోంది. ప్రాక్టికల్ గా చూసుకుంటే… ఇది సాధ్యమా అనే అనుమానాలూ కలుగుతున్నాయి. ఎందుకంటే, మరో నాలుగేళ్ల నాటికి కేసీఆర్ కి ఏకైక రాజకీయ వారసుడిగా కేటీఆర్ ని అన్ని విధాలుగా ఎస్టాబ్లిష్ చేసే పనిలో ఉన్నారు. దాన్లో భాగంగానే… హరీష్ రావు ప్రాధాన్యతను మెల్లగా తగ్గించుకుని వచ్చారనడంలో సందేహం లేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు కూడా కేటీఆర్ కి ఇచ్చి మరో మెట్టు ఎక్కించారు. అంటే… ఈసారి సార్వత్రిక ఎన్నికలు వచ్చేనాటికి అన్ని విధాలుగా కేటీఆర్ ని నిలబెట్టేందుకు కావల్సిన బలమైన పునాదుల్ని కేసీఆర్ వేస్తున్నారు.
ఇలాంటి వ్యూహం అమల్లో ఉన్న ఈ తరుణంలో పార్టీ బాధ్యతల్ని కవితకు అప్పగిస్తే… కచ్చితంగా మరో అధికార కేంద్రం తయారయ్యే అవకాశం ఉంటుంది కదా! ఆమె అలా వ్యవహరిస్తారా లేదా అనేది తరువాతి చర్చ. నిజానికి, ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కవిత ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనీ, రాష్ట్ర కేబినెట్లో ఆమె పనిచేయాలని ఆశపడుతున్నారనే కథనాలు వినిపించాయి. కానీ, ఆమెని మళ్లీ ఎంపీగానే ఢిల్లీ పంపే ప్రయత్నమే జరిగింది! ఇప్పుడు కూడా ఆమెను రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారంలో కొంత వాస్తవం కనిపిస్తోంది. అంతేగానీ, పార్టీ బాధ్యతలు ఇవ్వడం అనేది… కేసీఆర్ పరిగణనలో ఉంటుందా అంటే అనుమానమే. కానీ, ప్రస్తుతం పార్టీ వర్గాల్లో ఈ చర్చ జరుగుతోంది!