ప్రస్తుతం తెలంగాణలోని రాజకీయ పరిమామాలు బీఆర్ఎస్ పార్టీని కలవర పెడుతున్నాయి. నిన్నటి దాకా తన దర్శనం కోసం పడిగాపులు కాసిన నేతలంతా ఇప్పుడు వేరే పార్టీలో చేరిపోవటం, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా దిక్కులు చూడటంతో కేసీఆర్ దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. గత ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని దాదాపు అన్ని సీట్లు గెలుచుకుని ఆధిక్యాన్ని ప్రదర్శించిన ఆ పార్టీకి నేడు లోక్‌సభ అభ్యర్థులు కరువవయ్యారు. అధికారంలో ఉండగా అన్నీ తానై వ్యవహరించిన కుమారుడు కేటీఆర్.. విపక్షంలోకి వచ్చిన రెండు నెలల్లోనే పార్టీని కాపాడుకోలేకపోవటం, హరీష్ రావు సైతం కేవలం తన జిల్లా రాజకీయాలకే పరిమితం కావటంతో కేసీఆర్ మళ్లీ రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.
లోక్‌సభ సీట్ల విషయానికొస్తే.. ఎంపీగా పోటీచేయాలంటే వంద కోట్లైనా ఖర్చు పెట్టక తప్పని పరిస్థితి ఉంది. దీంతో దీనికోసం పోటీపడే వ్యాపారవేత్తలు, సంపన్నులు తమ ప్రయోజనాలు నెరవేరాలని కోరుకోవటం సహజమే. అయితే.. పార్టీ ఓటమితో పాత నేతలెవరూ ఇప్పుడు ఎంపీ సీటు మాకొద్దంటే మాకొద్దని దూరంగా ఉంటున్నారు. గతంలో కేసీఆర్‌తో రాసుకుపూసుకు తిరిగి, పోటీకి ఉవ్విళ్లూరిన కొందరు సంపన్నులు సైతం మొహం చాటేయటం ఆ పార్టీని కలవరపరుస్తోంది.
రాష్ట్రంలో అధికారం పోయిన సిట్టింగ్ సీట్లను నిలుపుకునేందుకు తంటాలు పడాల్సి వస్తోంది. సిట్టింగ్‌లలో ముగ్గురు వేరే పార్టీలోకి వెళ్లిపోయారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పోటీ చేయలేనని చెప్పారు. మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఆయన బంధువులు కాంగ్రెస్ లో చేరిపోయారు. నల్గొండ, భువనగిరి, ఖమ్మం సీట్ల కోసం ఒక్క దరఖాస్తు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఉమ్మడి ఖమ్మం, నల్గొ్ండ జిల్లాల్లో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
ఖమ్మం జిల్లాలో గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ బాట పట్టటంతో అక్కడ నామా నాగేశ్వరరావుకే టిక్కెట్ ఖరారు చేశారు. కానీ ఆయన బీజేపీ తరపున పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంటోంది. మహబూబ్ నగర్ సీటు, వరంగల్లు, మహబూబాబాద్‌లోనూ అదే పరిస్థితి. సికింద్రాబాద్ సీటు నుంచి తలసాని సాయిని బరిలో దించాలని పార్టీ భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో సత్తా చాటలేకపోతే.. మరో 5 ఏళ్ల నాటికి పార్టీ నామరూపాల్లేకుండా పోయేలా ఉందనేది ఎక్కువ మంది భావన. ఈ పరిస్థితి నుంచి కేసీఆర్ గట్టెక్కాల్సి ఉంది.