మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆ మధ్య కేసీఆర్ ఆపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే కనీసం స్పందన లేదు. కానీ హఠాత్తుగా శనివారం కేటీఆర్ జూపల్లి కృష్ణారావు ఇంటికెళ్లిపోయారు. నాగర్ కర్నూలు టీఆర్ఎస్ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ ఆ తర్వాత నేరుగా జూపల్లి ఇంటికెళ్లారు. జూపల్లి టీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడం మానేసి చాలా కాలం అయింది. ఆయన కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతున్నారని మంచి రోజు చూసుకుని ఆ పార్టీలో చేరిపోతారన్న ప్రచారం జరుగుతోంది. ఏ కార్యక్రమానికి జూపల్లి రాకపోయినా పట్టించుకోలేదు.. ఆహ్వానాలు కూడా పంపలేదు. కానీ కేటీఆర్ మాత్రం అనూహ్యంగా జూపల్లి ఇంటికెళ్లారు.
టీఆర్ఎస్ సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు గత ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి ఓడిపోయిన తర్వాత హైకమాండ్ ఆయనను పక్కన పెట్టింది. అక్కడ కాంగ్రెస్ నుంచి గెలిచిన హర్షవర్థన్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని ఇక టీఆర్ఎస్ అంటే కొల్లాపూర్లో ఆయనేనని సంకేతాలు ఇచ్చింది. పార్టీ, ప్రభుత్వం రెండూ ఫిరాయింపు ఎమ్మెల్యే ద్వారానే నడుస్తున్నాయి. దీంతో సీనియర్ నేత అయిన జూపల్లికి అవమానం జరిగినట్లయింది. ఆయనపై పలుమార్లు హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన బలాన్ని నిలుపుకునేందుకు జూపల్లి పార్టీని పట్టించుకోలేదు.
అయితే ఇప్పుడు జూపల్లిని టీఆర్ఎస్లోనే ఉంచారని కేటీఆర్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ నేరుగా ఇంటికి వెళ్లి కలిశారు. మామూలుగా కేటీఆర్ అలా పార్టీకి దూరంగా ఉన్న వారి ఇళ్లకు వెళ్లడం అరుదు. దీంతో జూపల్లిని కేటీఆర్ బుజ్జగించి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. అయితే జూపల్లి మాత్రం గుంభనంగా ఉన్నారు. ఇంత కాలం అవమానించి ఇప్పుడు వచ్చి బుజ్జగిస్తే తగ్గిపోతామా అన్నట్లుగా ఆయన వ్యవహారశైలి ఉందని అనుచరులు చెప్పుకుంటున్నారు.