వచ్చే లోక్ సభ ఎన్నికలతోపాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కలిపి నిర్వహించే అంశంపై కొంత కదలిక కనిపిస్తోంది. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ మధ్య కొన్ని సందర్భాల్లో మాట్లాడారు. రాజకీయ సుస్థిరత రావాలంటే దేశంలో ఒకేసారి జరగాలని ఆయన చెప్తుంటారు. ఒకేసారి ఎన్నికలు పెట్టడం వల్ల నిర్వహణ వ్యయాన్ని గణనీయంగా తగ్గించొచ్చన్నది ప్రధాని ఆలోచన. ఇప్పుడు ఇదే అంశమై కేంద్రంలో మరోసారి చర్చ మొదలైంది. వచ్చే లోక్ సభ ఎన్నికలతోపాటు వీలైనన్ని రాష్ట్రాల అసెంబ్లీలను కలిపి నిర్వహించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై పరిశీలన జరుగుతోంది. 2018 నవంబర్ – డిసెంబర్ ప్రాంతంలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. వాటితోపాటు లోక్ సభ ఎన్నికల్ని కూడా పెట్టేయొచ్చా అనే ప్రతిపాదన తెరమీదికి వచ్చింది.
నిజానికి, అసెంబ్లీ ఎన్నికలను గడువు తరువాత ఆర్నెల్లలోపు నిర్వహించుకునే అవకాశం ఉంటుందని, ఆలోగా లోక్ సభ ఎన్నికలు కూడా వస్తే కలిపి నిర్వహించే అవకాశం ఎన్నికల కమిషన్ కు ఉంటుందని లోక్ సభ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్ అభిప్రాయపడుతున్నారు. దీనికోసం ఎలాంటి రాజ్యాంగ సవరణలూ చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. అయితే, సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా.. రాజకీయంగా సమీకరణాలను ఏకీకృతం చేయడమే అసలైన సవాల్ అవుతుందని చెప్పొచ్చు. గడువు ప్రకారం ఏప్రిల్ 2019లో లోక సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ గడువును కాస్త ముందుకు జరుపుకుంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ లతో లోక్ సభ ఎన్నికల్ని కలిపి నిర్వహించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, ఒక్క మిజోరం మినహా మిగతావన్నీ భాజపా అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలే కాబట్టి!
రెండు ఎన్నికలూ ఒకేసారి జరగాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలతోపాటు ఒడిశా కూడా కోరుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ మేరకు కొన్ని నెలల ముందుగానే అధికారాన్ని వదులుకోవడానికి ఆయా రాష్ట్రాలు సిద్ధపడాల్సి ఉంటుంది. 2014 ఎన్నికల్లో మోడీ హవా తెలుగుదేశం పార్టీకి కలిసొచ్చిన సంగతి తెలిసిందే. ఇంకోపక్క వచ్చే ఎన్నికల్లో భాజపాతో కలిసి నడవాలని తెరాస ఉవ్విళ్లూరుతోంది. భాజపాతో దోస్తీ స్థానికంగా లాభించే అవకాశం ఉంది కాబట్టి.. ఆ మాత్రం త్యాగానికి చంద్రబాబు, కేసీఆర్ లు సిద్ధపడే అవకాశం ఉంటుంది. ఏదేమైనా, వీలైనన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను లోక్ సభతో కలిపి నిర్వహించాలనే పట్టుదలతో భాజపా ఉందని తెలుస్తోంది. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ఏడాదికి మించి గడువు ఉన్నా… వారితో చర్చించే ప్రయత్నం చేస్తామని కూడా కశ్యప్ అంటున్నారు. భాజపా పాలిత రాష్ట్రాలతో చర్చించి జమిలి ఎన్నికలకు ఒప్పించగలమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కన ఈసారి లోక్ సభతోపాటు చాలా రాష్ట్రాల ఎన్నికలు కలిపి జరిగే అవకాశం ఉంది.
అయితే, ఈ ప్రతిపాదనపై కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రం కోసం రాష్ట్రాల అసెంబ్లీలకు గడువుకు ముందే ఎన్నికలు నిర్వహించడం సరైన పద్ధతి కాదనేది కొంతమంది వాదన. ఇది భాజపాకి మేలు చేసుకోవడం కోసం తీసుకుంటున్న చర్యగా అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే ఒక్కో రాష్ట్రాన్ని టార్గెట్ చేసుకుని భాజపా అధికారం చేజిక్కించుకుంటోందనీ, జమిలి ఎన్నికల పేరుతో రాజకీయ లబ్ధి కోసం మోడీ చూస్తున్నారనే ఆరోపణలున్నాయి. కానీ, తడిసి మోపెడు అవుతున్న ఎన్నికల నిర్వహణ వ్యయం, నెలలపాటు సాగే ప్రక్రియ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆలోచిస్తే ఒకేసారి ఎన్నికలు అనే అంశం బాగానే ఉందనిపిస్తోంది.