తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, బీఎస్పీ నాయకురాలు మయావతి ప్రధాని పదవిని ఆశిస్తున్న వారిలో ముందు వరుసలో ఉన్నారు. బీజేపీయేతర పార్టీలన్ని కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాని పదవే అడ్డంకిగా మారితే .. అప్పుడు సోనియా చక్రం తిప్పే సూచనలు కనిపిస్తున్నాయి. మమతా బెనర్జీకి కానీ మాయవతికి కానీ పీఎం పదవి ఇచ్చైనా సరే.. విపక్షాల ఐవ్యత కొనసాగించాలని యూపీఏ చైర్పర్సన్ సోనియా దృఢ నిశ్చయంతో ఉన్నట్లు ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది.
ప్రాంతీయ పార్టీల ఫ్రెండ్లీ పార్టీ కాంగ్రెస్..!
పదేళ్ల పాటు అధికారం అనుభవించి …. తీవ్ర అధికార వ్యతిరేకతతో 2014లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్.. ఈ సారి సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. తాము అధికారంలోకి రాకపోయినా సరే బీజేపీ ఓడిపోతే చాలన్న భావనలో ఆపార్టీ ఉంది. ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ అజాద్ కూడా యూపీఏ తరపున ప్రధాని ఎవరైనా పరవాలేదన్నట్టుగా మాట్లాడారు. అదే కాంగ్రెస్ పార్టీ వైఖరి కూడా అయితే.. యూపీఏ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం పెద్ద సమస్య కాకపోవచ్చు. ఎన్డీయే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైతే.. కీలక మంత్రిత్వ శాఖలైన హోం, రక్షణ, రైల్వే, గ్రామీణ అభివృద్ధి, ఉపరితల రవాణా వంటి వాటిని బీజేపీ తన వద్దే అంటిపెట్టుకుంటుంది. ఇతర పార్టీలు కోరుకున్నా ఆ శాఖలని ఇవ్వదు. అయితే కాంగ్రెస్ మాత్రం ఇందుకు పూర్తి విభిన్నం. ఫైనాన్స్, విదేశీవ్యవహారాలు మినహా ఇతర శాఖలను మిత్రపక్షాలకు ఇచ్చేందుకు ఏ మాత్రం వెనుకాడబోదు.
రాహులే ప్రధాని అని పట్టుబట్టని కాంగ్రెస్..!
తమ ఎన్నికల ప్రచారంలో కూడా రాహులే ప్రధాని అవుతారని ఎక్కడా చెప్పకుండా జాగ్రత్తపడింది. ఇక్కడ గమనించాల్సి మరో విషయం ఏమిటంటే.. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఈసారి ఎన్నికల ప్రచారంలోగానీ, పార్టీ నిర్ణయాలకు కానీ దూరంగా ఉన్నారు. రాహుల్‌కు తల్లిగానే కాదు, కాంగ్రెస్ మాజీ చీఫ్‌గా కూడా ఇతర నిర్ణయాల్లో తలదూర్చలేదు. రాహుల్ సమర్థుడైన నాయకుడన్న భావన ఇతర పార్టీల్లో కల్పించేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నించారు. ఎన్నికల ఫలితాల తర్వాత కచ్చితంగా సోనియాగాంధీ మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశముంది. హంగ్ ఏర్పడే పరిస్థితి వచ్చినా.. కాంగ్రెస్ ఆ అవకాశాన్ని తమకు అనుకూలంగానే మలుచుకునే విధంగా ఆమె వ్యవహరిస్తారని భావిస్తున్నారు.
అవసరం అయితే మాయావతి, మమతా బెనర్జీల్లో ఒకరికి చాన్స్..!
కేంద్రంలో మాయావతి, మమతా బెనర్జీలో అత్యంత కీలక పాత్ర పోషించబోతున్నారు. వారు.. ఎటు వైపు ఉంటే.. ప్రభుత్వం అటు వైపు ఏర్పడుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే.. వారితో సన్నిహిత సంబధాలున్న సోనియా నేరుగా రంగంలోకి దిగారు. వారితో చర్చలు కూడా జరిపే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి.. ఎక్కువ సీట్లు వస్తే.. రాహుల్ ను ప్రధానిగా వారితో అంగీకరింప చేయాలని అనుకుంటున్నారు. ప్రాంతీయ పార్టీలే అత్యధికం సాధిస్తే.. వారిలో ఒకరికి ప్రధాని పదవికి మద్దతిచ్చే అవకాశం ఉంది. అవసరమైతే రాహుల్‌ను ప్రధాని పదవిని త్యజించేలా ఒప్పించైనా సరే.. యూపీఏ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటయ్యేలా సోనియా చక్రం తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.