వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ అప్పుడే కసరత్తు మొదలుపెట్టింది. ఈసారి గట్టి పోటీ ఇవ్వాలని, వీలైతే గెలవాలని కాంగ్రెస్ నేతలు కొందరు సీరియస్ గానే ఉన్నారు. లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ను పోటీ చేయించాలని కొందరు నేతలు భావిస్తున్నారు. గత ఏడాది సభలో తెలంగాణ బిల్లును పాస్ చేయించడంలో ఆమె తీసుకున్న చొరవ అసాధారణమని, సీమాంధ్ర ఎంపీలు ఎంత అడ్డుకున్నా ఆమె బిల్లుకు ఆటంకాలు రాకుండా సభను నడిపించారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఆనాడు లోక్ సభలో యుద్ధ వాతావరణం నెలకొన్నా, మీరా కుమార్ భయపడకుండా ధైర్యంగా బిల్లుపై ఓటింగ్ జరిపించారని గుర్తుచేస్తున్నారు.
ఉప ఎన్నికలో ఇదే పాయింట్ మీద మీరా కుమార్ ప్రజల మద్దతు పొందే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేతల అంచనా. అయితే ప్రస్తుత తెలంగాణలో అంతా కేసీఆర్ హవా నడుస్తోంది. ఆయన ఏం చెప్పినా నమ్మే జనమే ఎక్కువ. తెలంగాణ సాధకుడిగా ఆయన ఇమేజి అలాంటిది. ఏడాది గడిచినా ఉద్యోగ నియామకాల వంటివి జరగక పోయినా, బంగారు తెలంగాణ చేస్తాననే ఆయన మాటలను జనం ఇంకా నమ్ముతున్నారు. పెన్షన్లు తప్ప, మరే పనులూ జరగకపోయినా జరుగుతాయనే ఆశతో కేసీఆర్ పై నమ్మకంతో ఉన్నట్టు కనిపిస్తోంది.
వరంగల్ ఉప ఎన్నికలో గెలుపు నల్లేరు మీద నడక అని తెరాస గట్టి నమ్మకంతో ఉంది. అభ్యర్థి ఎవరైనా గెలుపు లాంఛనమే అనే ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. మరోవైపు, టీడీపీ బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది తేలాల్సి ఉంది. ఈ రెండు పార్టీలకూ తమకంటూ ఓటు బ్యాంక్ ఉంది. టీడీపీని దెబ్బకొట్టడానికి తెరాస ఎన్ని ఎత్తులు వేసినా పాక్షికంగానే సఫలమైంది. ఇప్పటికీ గట్టి క్యాడర్ తో తెరాసను సవాల్ చేయడానికి టీడీపీ రెడీగా ఉంది. బీజేపీకి కూడా సంప్రదాయ ఓటు బ్యాంక్ చెక్కు చెదరకుండా ఉంది. ఈ సమయంలో, ప్రధానంగా ముక్కోణపు పోటీ అనివార్యమవుతుంది.
కడియం శ్రీహరి స్థానంలో కాబోయే ఎంపీ ఎవరో తేలాలంటే కనీసం మూడు నెలలు పట్టవచ్చు. బహుశా సెప్టెంబర్, అక్టోబర్లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఈ ఉప ఎన్నిక జరగవచ్చు. కాంగ్రెస్ పరిస్థితిన చూస్తే అంతా ఏకతాటిపై లేరు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను పార్టీ పట్టించుకోవడం మానేసింది. దీంతో ఆయన మనస్ఫూర్తిగా ఎన్నికల్లో పని చేయడం అనుమానమే. అన్ని వనరులూ సమీకరించుకుని అధికార పార్టీని ఢీకొట్టాల్సిన పరిస్థితుల్లో, కొందరిని పక్కనపెట్టడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరగవచ్చు.
తెలంగాణ బిల్లుపై ఓటింగ్ సమయంలో సీమాంధ్రలు అభ్యంతరాలను ఎదుర్కొని ఓటింగ్ నిర్వహించడం వాస్తవమే. అందుకు మీరా కుమార్ కు చాలా మంది ధన్యవాదాలు తెలిపారు. ఆ ఒక్క కారణంతోనే ఆమె విజయం సాధిస్తారా అనేది ప్రశ్న. ఎన్నికల్లో గెలవాలంటే క్యాడర్ కూడా బలంగా ఉండాలి. కానీ కాంగ్రెస్ క్యాడర్ లో ఉత్తేజం నింపడానికి ఇప్పటి వరకూ సరైన ప్రయత్నమే జరగలేదు. నిస్తేజంగా ఉన్న క్యాడర్ తో విజయం సాధిస్తామనుకుంటే అని నేల విడిచి సాము చేయడమే కావచ్చు. ఈ ఏడాదిలో క్యాడర్ లో జోష్ నింపామని కాంగ్రెస్ నేతలు గట్టిగా చెప్పలేకపోతున్నారు. కాబట్టి, ఇప్పుడైనా పార్టీ శ్రేణులను ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేస్తేనే, అనుకున్న ప్రకారం తెరాసతో ఢీ అంటే ఢీ అనేలా పోటీ పడే అవకాశం ఉంటుంది.