రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తిగారు ఫిడేల్ వాయించుకుని కూర్చున్నారట! ఆంధ్రా ఆక్రందనతో ఉంటే… ఆయన ఎన్నికల గొప్పతనం గురించీ, ప్రజాస్వామ్యంలో ప్రజలకున్న అధికారం గురించి ట్వీట్లు చేస్తున్నట్టున్నారు! ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాజాగా ఓ ట్వీట్ చేశారు. “ఎలక్షన్స్ ఆర్ సెలబ్రేషన్స్ ఆఫ్ డెమోక్రసీ. దే కమ్యూనికేట్ ద విల్ ఆఫ్ ద పీపుల్, విచ్ ఈజ్ సుప్రీమ్ ఇన్ డెమోక్రసీ” అన్నారు. ఎన్నికలు అంటే ప్రజాస్వామ్యం ఒక పండుగ అనీ.. ప్రజల మనోభావాలకు ప్రతిబింబం అని చెప్పారు. సోషల్ మీడియాలో ఆయన ఈ ట్వీట్ పెట్టగానే ఆంధ్రా నుంచి కొన్ని కామెంట్స్ వచ్చాయి. “రాష్ట్రంలో జరుగుతున్నది కనిపిస్తోందా” అంటూ సూటి ప్రశ్నలు పడ్డాయి! కానీ, అలాంటి కామెంట్స్‌ను పట్టించుకునే పరిస్థితిలో మోడీ ఉన్నారా అనేది అసలు ప్రశ్న.
ఆంధ్రా అంటే కేంద్రానికి ప్రత్యేకమైన అభిమానం ఉండదు! ఒకవేళ అలాంటిదేదైనా ఉంటే… ప్రత్యేక హోదాపై మోడీ సర్కారు స్పందన మరోలా ఉండేది. ప్యాకేజీ ఇచ్చేసి చేతులు దులిపేసుకోరు. ఆంధ్రాలోని అధికార పార్టీ తెలుగుదేశంతో దోస్తీ ఉన్నా… అది కూడా నామ్ కే వాస్తే అన్నట్టుగానే ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే, ఆంధ్రాలో భాజపా సోలో పార్టీగా ఎదగాలన్నది వారి లక్ష్యం. దాన్ని ముందుకు సాగనీయకుండా చంద్రబాబు ప్రతిబంధకం అయ్యారన్నది భాజపా పెద్దల కడుపుమంట. సో… ఇలాంటి తరుణంలో ఆంధ్రాకి ఏం చేసినా అది చంద్రబాబు ఖాతాలోకి వెళ్తోందే తప్ప.. భాజపా ప్రొగ్రెస్ రిపోర్టులో నమోదు కావడం లేదు. దీంతో సాధారణంగానే ఆంధ్రా పరిణామాల పట్ల ఒకింత ఉదాసీన వైఖరితోనే కేంద్రం ఉంటుంది. ఇప్పుడు విశాఖలో జరుగుతున్న ప్రత్యేక హోదా శాంతియుత నిరసన విషయంలోనూ దాదాపు అలాంటి స్పందనే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.
నిజానికి, ఆంధ్రా పట్ల కేంద్రానికి ఇలాంటి వైఖరి ఏర్పడటానికి కారణం చంద్రబాబు నాయుడు ఇచ్చిన కొమ్ములే! ప్రత్యేక హోదాపై ఆయన కేంద్రాన్ని ఏనాడూ ప్రశ్నించింది లేదు. ఇచ్చినమాట నిలబెట్టుకోవాలని గట్టిగా నిలదీసిందీ లేదు. రాష్ట్రంలో తెలుగుదేశం, కేంద్రంలో భాజపా ఉంటే నవ్యాంధ్రకు న్యాయం జరుగుతుందని నమ్మి ప్రజలు ఎన్నికల్లో ఓట్లు వేశారు. కానీ, ఆంధ్రానిక కేంద్రం ఒరగబెట్టింది ఏంటీ..? రాష్ట్రం రాబట్టింది ఏదీ..? అంటే, ఓట్ల ద్వారా తప్ప.. ఇతర ప్రజాస్వామ్యబద్ధ మార్గాల ద్వారా ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంటే అది పాలకులకు వినిపింవా..? గడచిన వారం రోజులుగా ఆంధ్రాలో ఇన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నా… కేంద్రం తీరును టార్గెట్ గా చేసుకుని ప్రజలు ఉద్యమానికి సన్నద్ధమౌతున్నా.. హస్తిన వర్గాల్లో ఏమాత్రం కదలిక కనిపించడం లేదు. తమిళనాడుకు వచ్చేసరికి మాత్రం వెంటనే స్పందించేశారు..! ఎందుకంటే, అక్కడి కాలిక్యులేషన్స్ వేరు. అమ్మ మరణించాక తమిళనాడుపై భాజపా పెద్దలకు ఠక్కున బాధ్యత గుర్తొచ్చేసింది.
రాజకీయంగా తమిళనాడు నుంచి చాలా లబ్ధిని ఆశిస్తోంది కాబట్టి… అక్కడ చీమ చిటుక్కుమన్నా బాగానే వినిపించేసిందా..? ఆంధ్రా నుంచి పొలిటికల్‌గా భాజపాకి మైలేజ్ వచ్చే సిచ్యువేషన్ ఇప్పుడు లేదు కాబట్టి… ఆశేష ఆంధ్రా యువత గర్జిస్తున్నా చెవులకు వినిపించదా..? ఇదే ధోరణిని ఆంధ్రా విషయంలో కేంద్రం కొనసాగిస్తూ పోతే… ఆయన చెప్పినట్టుగా ప్రజాస్వామ్య పండుగ మున్ముందు వస్తుంది కదా..! ఆ పండుగకు చంద్రబాబు సర్కారు కూడా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.