ఢిల్లీలో మహిళా రెజ్లర్లు వారాల తరబడి చేస్తున్న పోరాటం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రో బీజేపీ మీడియా కవర్ చేయడం లేదు కానీ.. వారి సమస్యలపై మాత్రం సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరుగుతోంది. చాలా మంది స్పందించారు కానీ.. కేంద్రం స్పందించడంలేదు. బీజేపీ.. ప్రధాని మోదీకి ఈ రెజ్లర్ల పోరాటం విషయంలో చిక్కులు ఎదురవుతున్నా.. అధికారవర్గాలు స్పందించడం లేదు. ఆ రెజ్లర్ల సమస్యలు పరిష్కరించలేనంత పెద్దవా అంటే.. కానే కాదు.వారు తమపై జరుగుతున్న లైంగిక వేధింపుల నుంచి రక్షణ కోరుతున్నారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా బ్రిజ్‌భూషణ్ సింగ్ ఉన్నారు. ఆయన బీజేపీ ఎంపీ. ఆయన మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. దేశానికి పతకాలు తెచ్చిన ఎంతో మంది మహిళా రెజ్లర్లు ఈ ఆరోపణలు చేస్తున్నారు. సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, భజరంగ్ పునియా వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. కానీ కేంద్రం, క్రీడాశాఖ ఉన్నతాధికారులు కూడా.. ఎంపీకే మద్దతుగా ఉంటున్నారు కానీ రెజ్లర్ల గురించి పట్టించుకోవడం లేదు.
బ్రిజ్ భూషణ్..క్రీడాకారుడేం కాదు.ఆయన యూపీ రాజకీయ నాయకుడు. చాలా కేసులు ఉన్నాయి. అన్నింటికీ మించి వందకుపైగా విద్యా సంస్థలు నడుపుతూ ఉంటారు. ఆయనకు బలం ఉన్న ప్రాంతాల్లో .. బీజేపీ ఉందంటే దానికి కారణం బ్రిజ్ భూషణే. బ్రిజ్ భూషణ్ బలమే బీజేపీ బలం. అందుకే అంత మంతి రెజర్లు రోజుల తరబడి ఆందోళనలు చేస్తున్నా ఆయన పై చర్యలు తీసుకోవడానికి బీజేపీ సాహసించడం లేదు.
సోషల్ మీడియాలో ఏదైనా చిన్న వ్యతిరేక ప్రచారం జరిగితే బీజేపీ వెంటనే స్పందిస్తుంది.కానీ బ్రిజ్ భూషణ్ విషయంలో మాత్రం ఎంత ప్రచారం జరుగుతున్నా స్పందించడానికి పెద్దగా సాహసించడం లేదు. అలాగని మహిళా రెజ్లర్లూ తగ్గడం లేదు.