దేశంలో వారసత్వ రాజకీయాలు చాలా సర్వసాధారణమయిపోయాయి. చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇద్దరూ తమ కొడుకులను తమ రాజకీయ వారసులిగా తీర్చిదిద్దాలనుకొన్నారు. ఆ ప్రయత్నంలో కేసీఆర్ సఫలం కాగలిగారు కానీ చంద్రబాబు నాయుడు కాలేకపోయారు. కేసీఆర్ తన కొడుకు రాజకీయ అభివృద్ధి కోసం గ్రేటర్ ఎన్నికలను చాలా చక్కగా వాడుకొని ఒక పద్ధతి ప్రకారం అతనిని తిరుగులేని నేతగా నిలపగలిగారు.
చంద్రబాబు నాయుడు కూడా తన కుమారుడు నారా లోకేష్ ని తన రాజకీయ వారసుడిగా తీర్చిదిద్దేందుకు చాలా కృషి చేసారు. ముందుగా అందుకు అవరోధంగా ఉన్నట్లు కనిపించిన జూ.ఎన్టీఆర్ ని ‘ఒక పద్ధతి ప్రకారం’ పార్టీకి దూరం చేసారు. ఆ తరువాత పార్టీ, ప్రభుత్వ పగ్గాలు చేపట్టడానికి నారా లోకేష్ కి పోటీగా కనబడుతున్న నందమూరి బాలకృష్ణను వియ్యంకుడుగా మార్చేసుకొని కొడుకుకి పోటీ లేకుండా జాగ్రత్తపడ్డారు. ఆ తరువాత పార్టీ జాతీయ కమిటీని ఏర్పాటు చేసి దానికి తన కొడుకుని ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
రాహుల్ గాంధిని తన రాజకీయ వారసుడిగా, దేశ ప్రధానిగా చేయడానికి ఆయన తల్లి సోనియా గాంధీ ఏవిధమయిన జాగ్రత్తలు తీసుకొన్నారో అదేవిధంగా నారా లోకేష్ కోసం చంద్రబాబు నాయుడు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొన్నారని చెప్పవచ్చును కానీ రాహుల్ గాంధిలాగే నారా లోకేష్ కూడా (గ్రేటర్) ఎన్నికల సమయంలో తన శక్తి సామర్ధ్యాలను నిరూపించుకోలేక చతికిలపడ్డారు.
గ్రేటర్ ఎన్నికలలో ఇరువురు ముఖ్యమంత్రుల వారసులు నేరుగా డీ కొనప్పుడు తెదేపాకి కనీసం గౌరవప్రదమయిన స్థానాలు కూడా దక్కించుకోలేకపోవడం, అదే సమయంలో తెరాస ఊహించన దాని కంటే ఎక్కువస్థానాలు దక్కించుకోవడంతో అది నారా లోకేష్ వైఫల్యంగానే అందరూ భావించారు. ఒకవేళ అయన చెప్పినట్లు ఏ పార్టీకి మెజార్టీ రాకపోయున్నా ఆ ఓటమి ప్రభావం లోకేష్ పై పడి ఉండేది కాదు. కానీ గ్రేటర్ ఎన్నికలలో తెదేపా ఘోర పరాజయం పొందడంతో దానికి పూర్తి బాధ్యత నారా లోకేష్ వహించాల్సి వచ్చింది.
ఈ నేపధ్యంలో ఆయన చంద్రబాబు నాయుడుకి రాజకీయ వారసుడిగా ఎదగాలంటే ముందుగా తన రాజకీయ శక్తిసామర్ధ్యాలను నిరూపించుకొని, పార్టీలో నేతలని, ప్రజలను కూడా మెప్పించవలసి ఉంటుంది. ఆయన అందుకు సిద్దపడితే ఆయన ముందు ఒక గొప్ప సవాలు సిద్దంగా ఉంది. అదే…తెలంగాణాలో తెదేపాను బ్రతికించుకొని దానికి పూర్వవైభవం సాధించిపెట్టడం. అది లోకేష్ వల్ల అయ్యే పని కాదనే చెప్పవచ్చును కానీ తన శక్తి సమార్ధ్యాలను నిరూపించుకోవడానికి అంతకంటే గొప్ప సవాలు మరొకటి ఉండదనే చెప్పవచ్చును. పైగా ఆయన పార్టీకి జాతీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు కనుక ఆ సవాలును స్వీకరించి తన సత్తా చాటుకొంటే ఇంకా ఆయనకు తెదేపాలో తిరుగే ఉండదు.
ఒకవేళ ఆయన కూడా కేవలం ఆంధ్రాకే పరిమితం అవుదామని భావిస్తే, అక్కడ కూడా ఆయన కోసం మంచి సవాళ్ళే ఎదురుచూస్తున్నాయి. ఆంధ్రాలో పార్టీని, ప్రభుత్వాన్ని తన తండ్రి చంద్రబాబు నాయుడే స్వయంగా నడిపిస్తున్నారు కనుక తెలంగాణాతో పోలిస్తే కొంత నయమే. అయితే తెలంగాణాలో కె.టి.ఆర్.ని ఎదుర్కోవలసివచ్చినట్లే ఆంధ్రాలో కూడా ఆయన జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవలసి ఉంటుంది. సీబీఐ కేసుల నుంచి జగన్ ఏదోవిధంగా బయటపడగలిగితే అప్పుడు ఆయనని ఎదుర్కోవడం లోకేష్ వల్ల కాకపోవచ్చును. ఎందుకంటే ప్రజలను ఆకట్టుకొనే విషయంలో లోకేష్ కంటే జగన్మోహన్ రెడ్డే ఎప్పుడూ ముందుంటున్నారు.
రాష్ట్రంలో బీజేపీ తెదేపాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకొంటోంది కనుక ఒకవేళ ఎన్నికల సమయానికి ముందుగా అది తెదేపాతో తెగతెంపులు చేసుకొంటే అప్పుడు దాని నుండి కూడా సవాలు ఎదుర్కోవలసి ఉంటుంది. అదీగాక మిగిలిన ఈ మూడేళ్ళలో కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీ మేరకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఆ విషయంలో ఆయన విఫలమయినా ఆ ప్రభావం తెదేపాపై తద్వారా నారా లోకేష్ రాజకీయ భవిష్యత్ పై కూడా పడుతుంది. కనుక నారా లోకేష్ తన తండ్రికి వారసుడిగా ఎదగాలనుకొంటే తప్పనిసరిగా ఇప్పటి నుంచే చాలా గట్టిగా కృషి చేసి తన రాజకీయ శక్తిసామర్ధ్యాలను నిరూపించుకోవలసి ఉంటుంది లేకుంటే ఆయనకీ రాహుల్ గాంధి పరిస్థితే ఎదురవవచ్చును.