పవన్ కల్యాణ్ హీరోగా మారి దాదాపుగా పాతికేళ్లయ్యింది. ఈ పాతికేళక్లలో పవన్ నటించిన సినిమాలు పాతిక మించలేదు. సినిమాల విషయంలో పవన్ చాలా స్లో. తన కెరీర్ పిచ్చి పీక్స్ లో ఉన్నప్పుడు సైతం… యేడాదికి ఒకటి, రెండేళ్లకు ఒకటి చేసుకుంటూ వెళ్లాడు. తన క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలన్న ఆలోచన ఒక్కసారి కూడా రాలేదు. బహుశా… అదే పవన్‌ని ప్రత్యేకంగా నిలిపి ఉంటుంది. అయితే అప్పుడు పవన్ వేరు. ఇప్పుడు వేరు. తను రాజకీయాల్లో మమేకం అయ్యాడు. కొన్నేళ్లు అస్సలు సినిమాల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ మేకప్ వేసుకున్నాడు. వరసగా సినిమాల్ని ఒప్పుకుంటున్నాడు. ఇప్పటికే రెండు పట్టాలెక్కాయి. మరో రెండు చర్చల్లో ఉన్నాయి. మరో సినిమాకి కూడా పచ్చజెండా ఊపే అవకాశం ఉంది.
పవన్ టార్గెట్ 2 ఏళ్లలో 5 సినిమాలు పూర్తి చేయాలని. 2021 చివరి నాటికి ఈ 5 సినిమాలూ అయిపోవాలి. ఆ తరవాత మళ్లీ రాజకీయాలతో బిజీ. 2024 ఎన్నికలు అయ్యేంత వరకూ మళ్లీ సినిమాలు చేయడేమో. అయితే పవన్ రెండేళ్లలో 5 సినిమాలు చేయగలడా, లేదా..? అనేది పెద్ద సమస్య,
పింక్ రీమేక్‌గా తెరకెక్కుతున్న `వకీల్ సాబ్` ఏప్రిల్ లో వచ్చేస్తుంది. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలూ లేవు. క్రిష్ చిత్రాన్నీ ఈ యేడాదే విడుదల చేయాలన్నది ప్లాన్. వకీల్ సాబ్ అయ్యేలోగో హరీష్ శంకర్ – మైత్రీ మూవీస్ సినిమాని పట్టాలెక్కించే అవకాశం ఉంది. అది 2021 ప్రారంభంలో విడుదల కావొచ్చు. 2021లో మరో రెండు సినిమాలు లాగించేయాలి. అదేమంత కష్టం కాదు. ప్యాక్డ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటే సాధ్యమే.
కాకపోతే పవన్ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. తనకు సినిమాలతోనే లింకు లేదు. మధ్యమధ్యలో రాజకీయాలూ చేయాలి. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. జనసేన తొలిసారి ఈ ఎన్నికల్లో నేరుగా పాల్గొంటోంది. అసెంబ్లీ ఎన్నికల తరవాత జనసేన పార్టీ కాస్త అయినా పుంజుకుందా, లేదంటే మరింత చతికిల పడిందా అని తెలుసుకోవడానికి ఇదే అనువైన వేదిక. ఓ రకంగా జనసేనకు యాసిడ్ టెస్ట్ లాంటిది. ఈ ఎన్నికల్ని జనసేన సీరియస్‌గా తీసుకోవడం ఖాయం. నోటిఫికేషన్ దగ్గర్నుంచి – ఎన్నికలు అయ్యేంత వరకూ పవన్ సినిమాల గురించి ఆలోచించకపోవొచ్చు.
మధ్యమధ్యలో ప్రజా సమస్యలు, పోరాటాలూ తప్పనిసరి. అంటే నెలకు 15 రోజులు సినిమా, మరో 15 రోజులు రాజకీయాలు అంటూ సమయం కేటాయించుకోవొచ్చు. అయితే.. ఇంత ప్యాక్డ్ షెడ్యూల్స్ మధ్య అనుకున్న సమయానికి సినిమా పూర్తవ్వాలంటే.. గగనమే. చెప్పిన సమయానికే సినిమాలు రావడం కష్టమైపోతున్న ఈ తరుణంలో… ఇంత వేగంగా సినిమాలు పూర్తి చేయాలంటే – అద్భుతాలు జరగాలి. పైగా పవన్ మైండ్ సెట్‌కి ఇంత వేగం పనిచేయదు కూడా.
కానీ పవన్ మాత్రం ఎడా పెడా సినిమాల్ని ఒప్పుకుంటున్నాడు. ఇచ్చిన మాట మీద నిలబడడం పవన్ నైజం. కాబట్టి ఇది వరకు ఒప్పుకున్న సినిమాల్ని పూర్తి చేయడం ఖాయం. ఇదే మూడ్‌లో మరిన్ని సినిమాలు చేసి, ఆ డబ్బులతో పార్టీ ఆర్థిక అవసరాలు తీర్చాలని చూస్తున్నాడు. మరి ఈ ప్రణాళికలన్నీ పక్కాగా అమలు అవుతాయా, లేదా అనేది కాలమే చెప్పాలి.