ఎన్నికలైపోయి, రిజల్ట్ వచ్చేశాక కూడా `మా` వేడి తగ్గలేదు. ఆ నిప్పు ఏదో ఓ రూపంలో రాజుకుంటూనే ఉంది. తాజాగా ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచినవాళ్లంతా రాజీనామా చేసేశారు. ఇప్పుడు `మా`లో ప్రత్యర్థే లేకుండా పోయింది. ఇలాంటి ఘటన బహుశా.. రాజకీయ చరిత్రలోనే లేదేమో..? ఆ రకంగా `మా` కూడా ఓ చరిత్ర సృష్టించింది.
అయితే ఈ రాజీనామాల గోలేంటి? అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్ వ్యవహారం. బెనర్జీని మోహన్ బాబు బూతులు తిట్టారు. తనీష్ నీ నానా మాటలు అన్నారు. సమీర్ కీ కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఈ ముగ్గురూ రాజీనామా చేస్తే సరిపోయేది కదా? మిగిలిన వాళ్లంతా ఎందుకు చేసినట్టు..?
`మా`లో ఎన్నికలు జరిగితే ఒక్క ప్యానల్ లోని సభ్యులే గెలవాలని ఉందా? అలా జరిగే అవకాశమే లేదు కదా? అలాంటప్పుడు `ఒక్క ప్యానల్ నే ఎంచుకోండి` అని ప్రకాష్ రాజ్ వర్గం ఎలా ప్రచారం చేసింది? `మా` అధికారం.. విష్ణు చేతిలోకి వెళ్లింది. ఎవరేమన్నా, ఎన్ని అవకతవకలు జరిగాయని చెప్పుకున్నా, `మా` సభ్యుల్లో మెజారిటీ వర్గం విష్ణు వెనుక ఉంది. దాన్ని ఒప్పుకోవాల్సింది పోయి, రాజీనామా ఇచ్చేస్తే ఎలా?
`మా` తరపున పనులు చేయించాల్సిన బాధ్యత గెలిచిన ఈసీ మెంబర్లకు లేదా? ప్రత్యర్థి వర్గం, ప్రతిపక్షం లేకపోతే, అది ఏకపక్ష పాలన అవదా? అప్పుడు `మా` సభ్యులకు ఎలా న్యాయం చేసినవాళ్లవుతారు?
సినిమా బిడ్డలం తరపున 11మంది గెలిచారంటే.. వాళ్లకు `మా` సభ్యుల మద్దతు ఉన్నట్టే కదా? వాళ్లకు ఓటేసిన వాళ్లంతా ఇప్పుడు మోసపోయినట్టు కాదా? వాళ్లకేం సమాధానం చెబుతారు? ఒకవేళ అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ గెలిచి, మా బిడ్డలం తరపున ఐదుగురో, ఆరుగురో గెలిస్తే.. అప్పుడు కూడా ఇలానే మూకుమ్మడి రాజీనామాలు చేస్తారా? చేయరు కదా?
ప్రకాష్ రాజ్ గ్యాంగ్ ఆరోపణ ఒక్కటే.. మోహన్ బాబు బూతులు తిట్టడం. దాన్ని నిలదీయాల్సింది పోయి రాజీనామా చేస్తానంటే ఎలా? ఇదెలా ప్రజాస్వామిక ఎన్నిక అవుతుంది? ప్రజాస్వామ్యం వర్థిల్లాలని స్పీచులు దంచికొట్టిన ప్రకాష్ రాజ్ దీనిపై సమాధానం చెప్పగలరా?