హారర్ టచ్ వున్న ఓ కామెడీ ఎంటర్ టైనర్ లో రజనీకాంత్ నటిస్తారా? అని ఎవరూ ఊహించలేదు. కానీ ‘చంద్రముఖి’ తో ఆ మ్యాజిక్ జరిగింది. రజనీకాంత్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ ఇది. ఇప్పుడు‘చంద్రముఖి2 వస్తోంది. ఐతే ఇందులో రజనీ నటించడం లేదు. అ స్థానం రాఘవ లారెన్స్ కనిపిస్తున్నారు. తాజాగా ట్రైలర్ కూడా వదిలారు. కథ విషయంలో పెద్ద మార్పులు చేయలేదు. చంద్రముఖి.. పదిహేడేళ్ల తర్వాత మళ్లీ పగ తీర్చుకోవడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేసిందో ఇందులో చూపించనున్నారు. జ్యోతిక స్థానంలో కంగన కనిపించింది.
ట్రైలర్ లో పెద్ద కొత్తదనం కనిపించలేదు. అదే మహల్. అదే కుటుంబం. లేదంటే కొంతమంది పాత్రధారులు మారారు. విజువల్స్, గ్రాఫిక్స్ కూడా అంత గ్రాండ్ గా అనిపించలేదు. కీరవాణీ నేపధ్య సంగీతం మాత్రం పర్వాలేదనిపించింది. చంద్రముఖి విజయానికి కారణం రజనీ మ్యాజిక్ అనే చెప్పాలి. ఇప్పుడా మ్యాజిక్ ని క్రియేట్ చేసే బాధ్యత లారెన్స్ తీసుకున్నారు. కాంచన సిరిస్ తో హారర్ సినిమాలకు తనకంటూ ఒక ఫ్యాన్ భెస్ ని ఏర్పరుచుకున్నారు లారెన్స్. ఐతే చంద్రముఖి దీనికి భిన్నం. అందులో వేట్టయరాజా పాత్రని రజనీతన రాజసంతో పండించడంతో పాటు సినిమా అంతా తన మార్క్ స్టయిల్ తో అలరించేశారు.
చంద్రముఖి2 ట్రైలర్ చూస్తుంటే వేట్టయరాజా పాత్ర కాస్త ఎక్కువగానే వున్నట్లు వుంది. ఇలాంటి పాత్రలో రజనీ వుండివుంటే ఆ మ్యాజిక్ వేరుగా వుండేది. ఇప్పుడు రజనీ చేసిన పాత్రలో లారెన్స్ మెప్పించడం చాలా పెద్ద బాధ్యతే. గతంలో ‘చంద్రముఖి పార్ట్ 2 టైపులో దర్శకుడు పి వాసు, వెంకటేష్ తో ‘నాగవల్లి’ సినిమా చేసి విఫలమయ్యారు. మరి ఇప్పుడు రజనీలేని ‘చంద్రముఖి’ ఏ మేరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.