ఢిల్లీలో రాజకీయ పరిణామాలు నెమ్మదిగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి, ఎన్నికలు ఫలితాలు వచ్చాక ఇప్పుడున్న వాతావరణం కొనసాగుతుందా లేదా అనేది తేలిపోతుందనేది వేరే చర్చ. అంతిమంగా పార్టీ బలబలాల సంఖ్య ఏంటో వచ్చేలోపుగానే… జాతీయ రాజకీయాలపై కొంత ఆసక్తిని పెంచే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలకు ముందు… రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి రేసులో ఉండరు అని కాంగ్రెస్ నాయకులే చెప్పారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే… రేసులోకి ఆయన వచ్చేసినట్టుగా కనిపిస్తోంది. నిన్నమొన్నటి వరకూ కాంగ్రెస్ అంటే అస్సలు గిట్టని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా లైన్లోకి వచ్చేశారు. ఢిల్లీకి స్వయం ప్రతిపత్తి ఇస్తే… కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడానికి తనకేం అభ్యంతరం లేదని చెప్పేశారు. ఇదే రోజున ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాహుల్ తో భేటీ అయ్యారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్న ధీమా ఏంటంటే… మరో రెండు దశలు పోలింగ్ ఉండగానే భాజపా చేతులు ఎత్తేసిందని! ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోందని. భాజపాకి కనీసం 100 సీట్లు తగ్గిపోతున్నాయనేది రాహుల్ అంచనా. కాంగ్రెస్ కి సొంతంగానే దాదాపు 125 సీట్లు వస్తాయనీ, మిత్రపక్షాలకు మరో ఓ 80 దాకా వస్తాయని భావిస్తున్నారు. దీంతో, ప్రభుత్వ ఏర్పాటుకు మరో 70 సీట్ల దాకా మద్దతు కావాల్సి వస్తుంది. ఆ మద్దతు కూడగట్టే ప్రయత్నం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెయ్యగలరు అనే ధీమాతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. గతంలో మాదిరిగానే ఇప్పుడూ యూపీఏ అధికారంలోకి వస్తుందనే ధీమా కాంగ్రెస్ శ్రేణుల నుంచి వ్యక్తమౌతోంది.
అయితే, ప్రధానమంత్రి కలలు కంటున్న మమతా బెనర్జీ, మాయావతి పరిస్థితి ఏంటనే ప్రశ్న ఇక్కడ రావొచ్చు. ఎన్నికల ఫలితాల తరువాత… భాజపాకి మరోసారి అధికారం కట్టబెట్టొద్దు అనేదే ప్రధానాంశం అవుతుందనీ, అప్పటి పరిస్థితుల్లో భాజపాయేతర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన వాతావరణం ఏర్పడితే… ప్రధాని పదవి ఆశావహుల్లో ఉన్న అభిప్రాయాలు మారే అవకాశాలు ఉంటాయనీ, ఈ పోటీదారులు వెనక్కి తగ్గుతారని కాంగ్రెస్ అంచనా. దీంతో రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అవుతారనేది వారి అభిప్రాయం! అయితే, ప్రస్తుత పరిస్థితి కొనసాగాలంటే… కాంగ్రెస్ పార్టీకి సొంతంగా వందకుపైగా స్థానాల్లో ఎంపీ సీట్లు రావాలి. కూటమి పార్టీల మినహా… కాంగ్రెస్ బలమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించాలి. అప్పుడే ఇప్పుడు అంచనా వేసుకుంటున్న ఈ సమీకరణలన్నీ వర్కౌట్ అయ్యే అవకాశాలుంటాయి. ఏదైమైనా, ప్రస్తుతానికైతే రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం తథ్యం అనే సంకేతాలు కాంగ్రెస్ శ్రేణుల నుంచి వస్తున్నాయి.