రజనీకాంత్ రాజకీయం ఇప్పటి మాట కాదు. మూడు దశాబ్దాల నుంచి నానుతోంది. కానీ రజనీ మాత్రం ”దేవుడు ఆదేశిస్తాడు’ అనే సినిమా డైలాగులతోనే సరిపెట్టేశారు. అయితే ఎట్టకేలకు రజనీ నుంచి పొలిటికల్ పార్టీ ప్రకటన వచ్చింది. 2021లో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారని, జనవరీలో రాజకీయ పార్టీని ప్రారంభిస్తారని, అందుకు సంబంధించిన వివరాలను డిసెంబరు 31న ప్రకటిస్తానని ట్విట్టర్ వేదికగా తాజా ప్రకటన చేశారు.
రజనీకాంత్ కి ఆరోగ్యం బాలేదని, రాజకీయాలు పక్కన పెడితే.. సినిమాలు చేయడమే కష్టమని ఈ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. రజనీకాంత్ అంటే గిట్టని వారే ఈ ప్రచారం చేయించినప్పటికీ తలైవా ఫాన్స్ నిరాశ చెందారు. రజనీ నిజంగా రాజకీయాల్లోకి రాడేమో అని బాధ పడ్డారు. ఇప్పుడు వచ్చిన ఈ ప్రకటన రజనీ ఫ్యాన్స్ లో కొత్త జోష్ తెచ్చింది.
అదలావుంచితే రాజకీయాల్లో రజనీ ప్రభావం ఎంత ? అనేది ఇప్పుడు ప్రధాన చర్చ. రజనీకాంత్ బలం సినిమా. సినిమానే ఆయనకి ఎవరెస్ట్ స్థాయి క్రేజ్ తెచ్చిపెట్టింది. లక్షలాది అభిమానులు రజనీ సినిమా అంటే చాలు విజిల్స్ వేయడానికి థియేటర్ లోకి వాలిపోతారు. అయితే ఇలా థియేటర్లోకి వాలిపోయే జనం ఆయనకి ఓటు వేయడానికి పోలింగ్ బూత్ కి వస్తారా ? వస్తే ఆ ఓటు రజనీకే పడుతుందా ? అనేది ప్రశ్న.
సినీ గ్లామర్ ని మాత్రమే నమ్ముకొని రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు రజనీ. ఇలా సినీ గ్లామర్ ని మాత్రమే నమ్ముకొని వచ్చిన మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రయాణం కళ్ళముందే ఇంకా వుంది. సినిమా టికెట్టుకి, బ్యాలెట్ బాక్స్ కి తేడా ఏంటో చెప్పడానికి ప్రత్యేక్ష సాక్షిగా మెగాస్టార్ కనిపిస్తారు. ఫ్యాన్స్ ని ఓటర్స్ గా మార్చలేకపోయారు చిరు. దీంతో యూ టర్న్ తీసుకొని మళ్ళీ సినిమాల్లో వచ్చేశారు. 2019లో జరిగిన ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కి వచ్చిన ఆదరణా గుర్తుండే ఉంటుంది. ఆయన ఒకే ఒక్క సీటుకి పరిమితమయ్యారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణలు ఏముంటాయి?
ఇప్పుడు సూపర్ స్టార్ రాజకీయ రంగంలో దిగుతున్నారు. తమిళ రాజకీయ చిత్రంలో సినిమాలది ప్రత్యేక ఆకర్షణ. సినిమా వాళ్ళే అక్కడ రాజకీయ చక్ర్రం తిప్పిన చరిత్ర వుంది. యంజీఆర్, కరుణానిధి, జయలలిత .. ఇలా తమిళ రాజకీయం సినిమా స్టార్స్ చుట్టూ తిరిగింది. రజనీకాంత్ కూడా ఇదే కోవలోకి వస్తారని అభిమానుల ఆశ. అయితే మారుతున్న ఈ కాలంలో తమిళ రాజకీయ చిత్రంలో రజనీ మార్క్ ఏమిటనే సంగతి అప్పుడే తెల్చేయలేం.
రజనీకి అనుకూల, ప్రతికూల అంశాలు సమపాళ్ళలోనే వున్నాయి. సినిమా వాళ్ళకి తమిళంలో తిరుగులేదనే ఓ సానుకూల అంశం కనిపిస్తుంది. యంజీఆర్ తర్వాత అంతటి స్టార్ రజనీ. ఈ లెక్కన ఫ్యాన్స్ ఓటర్లుగా మారితే రజనీ రాజకీయ ప్రయాణం సులువుగానే జరిగిపోవచ్చు.
కానీ రాజకీయం ఒక్కలా వుండదు. ఒక్కసారి దిగాక బురద చల్లించుకోవడానికి సిద్దంగా వుండాలి. రజనీ కాంత్ కొన్ని విషయాల్లో ప్రతి పక్షాలకు ఈజీ టార్గెట్. రజనీ వయసు మీద పడిపోయింది. రాజకీయాల్లో నుండి కూడా రిటైర్ అయ్యే వయసులో పడ్డారు రజనీ. ఆయనకి ఇది ఓ ప్రతికూల అంశం. దానితో పాటు రజనీ విషయంలో ఎప్పటి నుండో స్థానికత వివాదం వుంది. రజనీ మూలాలు ముంబాయిలో వున్నాయని, రజనీ అసలు సిసలు తమిళుడు కాదని, కాలా మరాఠి అని ప్రతిపక్షాలు నినాదం ఎత్తుకొనే ఛాన్స్ పుష్కలంగా వుంది. అసలే ప్రాంతీయ అభిమానం మెండుగా వున్న అరవ సోదరలు ఈ పాయింట్ పై నిలబడితే మాత్రం రజనీ ప్రయాణం కష్టమే. దీని నుండి చాలా రాజకీయ చరుతరతో బయటపడాలి రజనీ.
ప్రస్తుతం రజనీ వయసు రిత్యా చూసుకుంటే ఆయనలో మునపటి ఫైర్ లేదని ఇన్ సైడ్ టాక్ వుంది. పొలిటికల్ పార్టీ నడపటం అంటే మాటలు కాదు. రజనీనే సెంటర్ అఫ్ ఎట్రాక్షన్ కాబట్టి ఆయనే సుడిగాలి పర్యటనలు చేయాల్సివస్తుంది. సమయం కూడా తక్కువ వుంది. మరి దీనికి రజనీ ఎలా సిద్దం అవుతారో కూడా చూసుకోవాలి.
మొత్తానికి జయలలిత తర్వాత అంతటి చరిష్మా వున్న ఓ లీడర్ కోసం తమిళ ప్రజలు ఎదురుచూస్తున్నారు. కమల్ హాసన్ పార్టీ పెట్టినప్పటికీ అదంత యాక్టివ్ లేదు. ప్రస్తుతానికి అయితే తమిళనాట ఓ బలమైన లీడర్ శూన్యత వుంది. మరి రజనీ ఆ శూన్యత భర్తీ చేస్తారా ? సూపర్ స్టార్ .. పొలిటికల్ స్టార్ కూడా అనిపించుకుంటారా ? అన్నది కాలం చెబుతుంది.