ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి రావడంతో టీటీడీలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. పాలకమండలి మారిపోయింది. ఇప్పుడు అందరి దృష్టి రమణదీక్షితులపై ఉంది. రమణదీక్షితులను మళ్లీ.. ఆయన ప్రధాన అర్చకుడ్ని చేస్తామని గతంలో వైసీపీ ప్రకటించింది. దాంతో.. వైసీపీ గెలిచినప్పటి నుంచి.. రమణదీక్షితులు మళ్లీ.. టీటీడీలోకి వస్తారన్న ప్రచారం జరుగుతోంది. కానీ న్యాయపరమైన చిక్కులు ఇప్పుడు రమణ దీక్షితులు పునరాగమనానికి అడ్డంకిగా మారాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం రమణ దీక్షితులను టీటీడిలోకి ఎలా తీసుకోవాలి అన్న ఆలోచనలో పడింది.
వాస్తవానికి రమణదీక్షితులను తొలగించిన తరువాత ఆ స్థానంలో వారి కుటుంబానికి చెందిన వారినే నియమించింది అప్పటి ప్రభుత్వం. ఖాళీగా వున్న అర్చక పోస్టులలో కూడా మీరాశి వంశీకులను అర్హత పరిక్ష ఆధారంగా నియమించేశారు. రమణదీక్షితులతో పాటు రిటైర్మెంట్ ప్రకటించిన నలుగురు ప్రధాన అర్చకులను తిరిగి టీటీడీలోకి తీసుకరావాలి అంటే మరో నలుగుర్ని తొలగించాలి. అలా తొలగిస్తే న్యాయపరంగా చిక్కులు వస్తాయి. దీనిపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది.
మరో వైపు గతంలో టీటీడీపై రమణ దీక్షితులు, విజయసాయిరెడ్డి గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన అప్పటి పాలకమండలి టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దీక్షితులతో పాటు విజయసాయి రెడ్డి పై పరువు నష్టం దావా వేసింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో వుంది. ఇక ప్రధాన అర్చకులుగా బాధ్యతలు స్వీకరించిన వేణుగోపాల దీక్షితులు సుప్రీం కోర్టులో ఓ పిల్ వేశారు. మరో ప్రధాన అర్చకుడు గోవిందరాజ దీక్షితులు హైకోర్టులో మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. తమ వాదనలు వినకుండా రమణదీక్షితులు వేసే పిటిషన్లను అడ్మిట్ చేసుకోకూడదని వారు కోరుతున్నారు. రమణదీక్షితులు కూడా.. తనను అన్యాయం తొలగించాలని కోర్టుకు వెళ్లారు. ఇప్పుడా పిటిషన్ హైకోర్టులో ఉంది.
వివాదాల మధ్య రమణదీక్షితులను ఇప్పటికిప్పుడు ప్రధాన అర్చకుడి హోదాలో తిరిగి తీసుకోవడం సాధ్యమయ్యేది కాదని టీటీడీ న్యాయవర్గాలు కూడా చెబుతున్నాయి. మధ్యే మార్గంగా రమణదీక్షితులను శ్రీవారి ఆలయంలోకి రప్పించేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగానే రమణ దీక్షితులకు సంబంధించిన అంశాన్ని మఠాధిపతులు, పీఠాధిపతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే టీటీడి పాలకమండలి చైర్మన్ సుబ్బారెడ్డి ప్రకటించారు. వారి నిర్ణయం మేరకే.. రమణదీక్షితులకు అవకాశం దక్కనుంది.