రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. అయితే అభ్యర్థులెవరో కనీసం ప్రచారంలోకి కూడా రావడం లేదు. విపక్షం పోటీ చేస్తుందో లేదో తెలియడం లేదు. ఎన్డీఏ అభ్యర్థి అంశంపై అస్పష్టత ఉంది. అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారు.. రకరకాల పేర్లు పరిశీనలోకి వస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఫలానా వారికే ఖాయం అని గట్టిగా చెప్పలేని పరిస్థితి. ప్రధానమంత్రి పదవి ఉత్తరాదికి ఉంటే… దక్షిణాదికి రాష్ట్రపతి పదవి ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. కానీ ఇటీవల ఆ సంప్రదాయాన్ని పాటించడం లేదు.
గతంలో ఉపరాష్ట్రపతిగా వెంకయ్యకు చాన్సిచ్చారు. కానీ రాష్ట్రపతి అభ్యర్థిగా మాత్రం ఉత్తరాదికే చాన్సిచ్చారు. దక్షిణాదిలో బలపడాలనుకుంటున్న బీజేపీ ఆ సారి దక్షిణాది అభ్యర్థికి చాన్సివ్వవచ్చన్న ప్రచారం బలంగా జరుగుతోంది. వెంకయ్యనాయుడు. తమిళిసై సౌందర్ రాజన్ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. గతంలో ఎస్సీ అభ్యర్థిని ఎంపిక చేసినందున ఈసారి ఎస్టీలకు అవకాశం ఇచ్చే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎస్టీ మహిళకు అవకాశం లభించే విషయంపై పార్టీలో అంతర్గత చర్చ జరిగినట్రుగా బీజేపీ వర్గాలు గతంలోనే తెలిపాయి. ఛత్తీస్‌గఢ్ గవర్నర్ అనసూయా ఉయికే, జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపదీ ముర్ము పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అస్సాం గవర్నర్ జగ్దీష్ ముఖీ, తమిళిసై సౌందర్ రాజన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
రాష్ట్రపతి అభ్యర్థి విషయమై ఇప్పటికే ఎన్డీఏ కూటమిలోని సీఎంలు, ఎన్డీఏతర పార్టీల ముఖ్యమంత్రులతోనూ చర్చలు జరిపారు. బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ , వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్ ప్రధానితో కూడా భేటీ అయి.. రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి పదవులకు అభ్యర్థులను మోదీ, అమిత్ షా ఎంపిక చేసే విధానం భిన్నంగా ఉంటుంది. గతంలో కోవింద్‌ను ఎంపిక చేస్తారని ఎవరూ ఊహించలేదు.