“పెగాసస్” సాఫ్ట్వేర్ సాయంతో దేశంలో జరిగిన రాజ్యాంగ ఉల్లంఘన.. వ్యక్తిగత స్వేచ్చపై దాడి వ్యవహారంపై దర్యాప్తు జరగాల్సిందేనన్న డిమాండ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ విషయంలో కేంద్రం.. విదేశీ కుట్ర అని చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో విపక్షాలతో పాటు.. ఎడిటర్స్ గిల్డ్ వంటి సంస్థలు కూడా.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని కోరుతున్నాయి. ఈ డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. “పెగాసస్” బాధితులైన వారు సామాన్యులు కాదు. రాహుల్ గాంధీ నుంచి ప్రస్తుతం బాధ్యతల్లో ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి వరకూ ఉన్నారు. ఈ మధ్యలో ఈ నిఘా సాయంతో ప్రభుత్వాలను కూడా మార్చారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే.. అందరూ పారదర్శకమైన విచారణ కోరుతున్నారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా బాధితుల్లో ఉన్నారు. ఈ కారణంగానే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తును.. విపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం.. వీలైనంత వరకూ ఈ “పెగాసస్” వ్యవహారాన్ని లో ప్రోఫైల్లో ఉంచాలనుకుంటోంది. తక్కువ చర్చకు పరిమితం చేయాలనుకుంటోంది. దర్యాప్తు అనే మాట వినడానికి కూడాసిద్ధపడటం లేదు. కేంద్ర ప్రభుత్వమే సిద్ధంగా లేనప్పుడు.. సుప్రీంకోర్టు నేరుగా రంగంలోకి దిగి. విచారణకు ఆదేశించే పరిస్థితి ఉండదు. ఒక వేళ ఆదేశించినా… ఆ దర్యాప్తునకు సరైన సహకారం లభించడం కష్టమవుతుంది. కేంద్రం అంగీకరిస్తేనే… సుప్రీంకోర్టు అయినా… విచారణకు ఆదేశించాల్సి ఉంటుంది.
“పెగాసస్” వ్యవహారంపై అందరి వేళ్లూ.. కేంద్రం వైపునే చూపిస్తున్నాయి. దీంతో నిజాయితీని నిరూపించుకోవాల్సిన పరిస్థితి కేంద్రంపైనే పడింది. తప్పించుకుంటే.. కేంద్రంపై మరిన్ని అనుమానాలు పెరుగుతాయి. విచారణ చేయిస్తేనే.. ధైర్యంగా ముందుకు వచ్చినట్లు అవుతుంది. కానీ కేంద్రం మాత్రం ఏమీ జరగలేదని.. “పెగాసస్” సాఫ్ట్ వేర్ అసలు ఇండియాలోకి రాలేదని.. తాము కొనలేదని చెబుతోంది. “పెగాసస్” కొనకపోతే.. విచారణ జరిపితే.. ఎవరు తీసుకు వచ్చారో స్పష్టమవుతుంది. కానీ కేంద్రం ఎందుకో వెనుకడుగు వేస్తోంది. బహుశా.. నిజాలు బయటపడటం.. ఇష్టం లేకనేమో..?