చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం అనీ ఓ సామెత ఉంది. దాదాపు రాజకీయ పార్టీలన్నీ ఇదే పనిచేస్తుంటాయి! ఒక పార్టీలో ఎవరో ఒక ప్రముఖ నాయుకుడు ఉంటారు. తన జీవితాంతం శ్రమించి పార్టీని ఒక స్థాయికి తీసుకొచ్చినవారు ఉంటారు. ఆ తరువాతి తరాలవారు.. ఆ నాయకుడి పేరు చెప్పుకుని, ఆ నాయకుడి ఫొటోనే అతికించుకుని ప్రచారం చేసుకుంటూ మనుగడ సాగిస్తుంటాయి. దాదాపు అన్నీ పార్టీలూ ఇలా చేస్తుంటాయి. ఇక, తెలుగుదేశం పార్టీకి అయితే… ఇప్పటికీ ఎప్పటికీ నందమూరి తారకరామారావు పేరు లేకుండా ప్రజల్లోకి వెళ్లలేదు. ఆయన ప్రస్థావన లేకుండా నాయకులు ప్రచారం చేసుకోరు, చేసుకోలేరు! ఎందుకుంటే, ఆ మహా నాయకుడి ప్రస్థానం అలాంటిది. మరి, ఈ విషయం జేసీ దివాకర్‌రెడ్డికి తెలీదేమో… ప్రతిపక్ష నేత జగన్‌ను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు!
జగన్ కు ఓ ఉచిత సలహా ఇచ్చారు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేరును 2014 ఎన్నికల్లోనే జగన్ వాడేశారని అన్నారు. రాబోయే ఎన్నికలు.. అంటే, 2019లో వైయస్ పేరు వాడుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్నట్టు మాట్లాడారు. కొత్త హామీల గురించి ఆలోచించుకోవడం మంచిదని అభిప్రాయపడ్డారు. కొత్త హామీలు ఇస్తే తప్ప వైకాపాకి భవిష్యత్తు ఉండదని జేసీ అన్నారు. అరిగిపోయిన రికార్డునే పట్టుకుని వేలాడటం వల్ల ఉపయోగం ఉండదన్నారు. ఇప్పటికీ జగన్ మహానేత మహానేత అంటూ ఉంటారని జేసీ కామెంట్ చేశారు.
సరే.. జేసీ చేసిన వ్యాఖ్యలు కాసేపు ఒప్పుకుందాం! ఆయన సూత్రీకరణ ప్రకారమే.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం కూడా ఎన్టీఆర్ పేరు ప్రస్థావన లేకుండా ప్రజల్లోకి వెళ్తుందా..? వచ్చే ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ చిత్రపటం కనిపించకుండా వెళ్లగల సత్తా చంద్రబాబుకు ఉందా..? వైయస్ లెగసీ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఎన్టీఆర్ తరువాత, అదేస్థాయిలో సామాన్య ప్రజానీకానికి అత్యంత చేరువైన నాయకుడు వైయస్సార్. ఆ సంగతి జేసీకి తెలియంది కాదు. ఇంకా చెప్పాలంటే… ఆ లెగసీ ఏంటో కాంగ్రెస్‌లో ఉండగా ఆయన కూడా చూశారు కదా! కాబట్టి, వైయస్ ఛరిష్మా 2014తోనే, లేదా మరో ఎన్నికతోనో అయిపోయిందని అనుకోవడం కరెక్ట్ కాదు. ఆ లెక్కన ఎన్టీఆర్ పేరును తెలుగుదేశం ఎప్పుడో వదిలేయాలి. ఏ ఛరిష్మా లేకుండానే ఎన్టీఆర్ పేరును, ఫొటోని చంద్రబాబు కూడా వాడుకోరు కదా! కాబట్టి, ఇలాంటి అంశాలపై కామెంట్స్ చేయకపోతే బెటర్. జేసీ కామెంట్స్ కామెంట్స్ వల్ల.. ఇదిగో ఇలాంటి చర్యలే మొదలయ్యాయి. ఓరకంగా ఇదీ తెలుగుదేశం పార్టీకి తలనొప్పి వ్యవహారమే అవుతుంది!