పుదుచ్చేరికి ప్రత్యేకహోదా ఇస్తామని బీజేపీ ఆ రాష్ట్ర మేనిఫెస్టోలో పెట్టడం ఏపీలో రాజకీయ ప్రకంపనలకు కారణం అవుతోంది. బీజేపీని కార్నర్ చేయడానికి టీడీపీతో పాటు కమ్యూనిస్టులు ప్రయత్నిస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డిలాంటి కొంత మంది నేతలు.. పుదుచ్చేరి మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా అంశం లేదని కొత్తగా వాదించడానికి ప్రయత్నించారు కానీ.. మేనిఫెస్టో కాపీలు.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రత్యేక హోదా అంశాన్ని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ బీజేపీ నేతలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే హోదా అంశంలో వారు ఇస్తామని చెప్పడం లేదు. సాధ్యం కాదనే అంటున్నారు.
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం సమయంలోనే పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో బిజేపీ పెట్టడం .. వైసీపీకి కూడా ఇబ్బందికరంగా మారింది. దీని పై ప్రశ్నించలేని దశకు వైసీపీ చేరిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.ద్వంద వైఖరి అవలంభిస్తున్న బిజేపీ విధానం పై ఆ పార్టీ ఏపీ నేతలు సమాధానం చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తుతున్నారు. ప్రత్యేక హోదా పై వైసీపీ నేతలు కూడా గళం విప్పక తప్పని పరిస్ధితి ఏర్పడింది. అయితే ఇప్పటికి మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ద్వారా తిరుపతి, శ్రీకాళహస్తిలోని బలిజ ఓటర్ల ద్వారా ఓట్లు వేయించుకోవాలన్న ఎత్తుగడలో ఉన్న బిజేపీకి పుదుచ్చేరి ప్రత్యేక హోదా అంశం ఇబ్బందికరంగాే ఉంది.
ప్రత్యేకహోదా అంశంపై… పుదుచ్చేరి అంశంపై వైసీపీ, జనసేన స్పందించాలని టీడీపీ పట్టుబడుతోంది.కానీ వారు ఆ విషయాలను మాత్రం పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు. ప్రజలు కూడా.. సీరియస్గా తీసుకుంటున్న సూచనలు కనిపించడం లేదు. దీంతో హోదా అంశంపై ఎంతగా రచ్చ చేసినా.. టీడీపీకి పెద్దగా వచ్చే మైలేజీ ఏమీ ఉండదన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే.. భవిష్యత్లో అయినా బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు ప్రజల్లో చర్చకు వస్తాయని.. అప్పుడు ఇలాంటివన్నీ తీవ్ర ప్రభావం చూపిస్తాయని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.