కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల అత్యంత కఠిన వైఖరి అవలంభిస్తోంది. అడ్డగోలు చట్టాలు చేసి రాజ్యాంగ వ్యతిరేకంగా అప్పులు తెస్తున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వానికి దండిగా అప్పులు చేసే చాన్స్ ఇచ్చింది. కానీ తెలంగాణకు మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ సర్కార్ కు రూపాయి కూడా అప్పు పుట్టలేదు. ఇప్పటి వరకూ ఎలాగోలా లాక్కొచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి జూన్లో తీవ్రమైన కష్టాలు ఎదురు కానున్నాయి.
ఈ వారం రూ. మూడు వేల కోట్ల అప్పు కోసం తెలంగాణ అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ కేంద్రం కొర్రీలు పెట్టింది. ఇప్పుడు జీతాల కోసం డబ్బులు వెదుక్కునే పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో రైతు బంధు పథకాన్ని అమలు చేయాలి. దానికి ఆరేడు కోట్ల వరకూ కావాలి. ఇలా చూసుకుంటూ పోతే ఆర్బీఐ దగ్గర పెండింగ్లో పెట్టిన అప్పులన్నీ తెచ్చుకున్నా సరిపోని పరిస్థితి. అయినా కేంద్రం మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదు.
ఏపీనే పూర్తి రుణ సమాచారం ఇవ్వడం లేదని కాగ్… ఏఏజీ వంటి వ్యవస్థలు లేఖలు రాస్తూ ఉంటాయి. కానీ తెలంగాణ మొత్తం పూర్తి క్లారిటీగా లెక్కలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయినా రాజకీయ కారణాలతోనే అప్పులకు అనుమతి ఇవ్వకుండా తమను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని టీఆర్ఎస్ నేతలు గొణుక్కుంటున్నారు. కానీ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేని పరిస్థితి ఉంది.