మహిళల్ని ట్రోల్ చేసిన వారిని రోడ్డు మీదనే తంతామని మూడు రోజుల కిందటే మహిళా సంఘాల సమావేశం పెట్టి మరీ ఆవేశపడ్డారు.. మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ. ఆ మహిళలు వైసీపీకి చెందినవారేనా ముఖ్యంగా ప్రభుత్వ పెద్దల కుటుంబాలకు చెందిన వారేనా.. లేక అందరికీ ఈ నిబంధన వర్తిస్తుందా అంటే మాత్రం సమాధానం చెప్పడం లేదు. తాజాగా అసలు రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని పవన్ కల్యాణ్ భార్యపై అత్యంత దారుణంగా పోస్టులు పెట్టారు వైసీపీ క్యాడర్.
వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి.. మాకు మూడ్ వచ్చినప్పుడు పవన్ భార్యను బయటకు తెచ్చి చూపించాలంటూ పెట్టిన పోస్ట్.. సంచలనంగా మారింది. ఇతర వైసీపీ హ్యాండిల్స్ కూడా ఇలాగే పవన్ భార్యను ట్రోల్ చేశాయి. కొంత మంది పవన్ తో పాటు ఆయన భార్య ఉన్న ఫోటో మార్ఫింగ్ అంటూ వీడియోలు చేశారు. వీటిపై జనసేన మహిళలకు డీజీపీని కలిపి ఫిర్యాదు చేయాలనకుంటున్నారు. అయితే ఈ రాష్ట్రంలో వైసీపీనేతలు ఏం చేసినా చెల్లుతుందనే రాజ్యాంగం అమలవుతోందని.. అన్యాయాన్ని చెప్పుకోవడానికి ఇతర పార్టీల వారికి డీజీపీ ఆఫీసులోకి ప్రవేశం ఉండటం లేదు.
మరో వైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియా హ్యాండిల్స్ పై ఆ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలతో పాటుగా, వారి అనుబంధ యూట్యూబ్ ఛానెల్స్, పలు మీడియా సంస్థలు ఉన్నాయి. వీరందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జనసేన పార్టీ ప్రకటించింది. వైసీపీకి చెందిన పన్నెండు ట్విట్టర్ అకౌంట్ల వివరాలను కూడా జనసేన ప్రకటించింది. ఏపీలో పోలీసులు కేవలం వైసీపీ నేతలు చేసే ఫిర్యాదులకే స్పందిస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే కోర్టులో కూడా కేసు ఫైల్ చేయాలని నిర్ణయించుకున్నారు.