చిలుకలూరిపేటను అడ్డంగా దోచేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి విడదల రజనికి గడ్డు పరిస్థితి ఎదురవడం ఖాయంగా కనిపిస్తోంది. ఓ స్టోన్ క్రషర్ యజమానిని మాఫియా తరహాలో బెదిరించి డబ్బులు కొట్టేసిన వ్యవహారంలో కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఈ కేసుల్లో ఆధారాలు అన్నీ ఉండటంతో గవర్నర్ కు కేసు నమోదు కోసం పంపారు. అనుమతి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే కేసులు నమోదు చేశారు.
ఓ స్టోన్ క్రషర్ యజమాని వద్దకు.. జాషువా అనే పోలీసు అధికారిని పంపి.. రూ.5 కోట్లు డిమాండ్ చేయించారు రజని. ఒప్పుకోకపోవడంతో విజిలెన్స్ తనిఖీలు చేయించి.. రూ.50 కోట్లు ఫైన్ వేయిస్తామని భయపెట్టారు. చివరికి రెండు కోట్ల ఇరవై లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఆ డబ్బులను స్వయంగా మంత్రి ఇంటికి తీసుకెళ్లి ఇచ్చారు.. ఫిర్యాదుదారులు. ప్రభుత్వం మారిన తర్వాత తమను అధికారం అడ్డం పెట్టుకుని ఎలా దోచుకున్నారో ఆ యజమానులు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ సహా అన్నీ దర్యాప్తులు పూర్తయి ఆధారాలు లభించడంతో కేసు పెట్టారు.
ఇప్పుడు విడదల రజనికి అరెస్టు ముప్పు పొంచి ఉంది. ఆమె ఇప్పటికే తనను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోర్టును ఆశ్రయించారు. కానీ ఇంత ఘోరంగా అధికార దుర్వినియోగం చేసి డబ్బులు వసూలు చేసిన ఆమెకు కోర్టుల్లో అయినా ఊరట లభిస్తుందా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.