హరితాంధ్రప్రదేశ్ నినాదం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడవులు హరించుకుపోతూండటానికి కారకులౌతూండటం పెద్ద విషాదం. బాక్సైట్ తవ్వకాలతో కలిపి దాదాపు 50 వేల ఎకరాల అటవీ భూముల్ని డీ నోటిఫై చేయాలని రాష్ట్రప్రభుత్వం కోరుతున్న నేపధ్యంలో లెక్కల్ని విశ్లేషించినపుడు ఉపన్యాసాలు మినహా పచ్చదనం పై చంద్రబాబు ఎప్పుడూ ప్రత్యేక దృష్టి పెట్టిన సందర్భాలు లేవని బయటపడుతోంది.
ప్రపంచవ్యాప్తంగా మొత్తం విస్తీర్ణంలో 31 శాతం అడవులు వున్నాయి.అంటే సగటున ప్రతి మనిషికీ 1.48 ఎకరాల అడవి వుంది. ఫారెస్టు సర్వే ఆఫ్ ఇండియా సంస్థ ప్రతి రెండేళ్ళకు ఒకసారి ‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు’ ప్రకారం దేశంలో అటవీ ప్రాంతం 6,93,848 చదరపు కిలోమీటర్లు (చ.కి.మీ.=100 హెక్టార్లు). ఇది దేశ విస్తీర్ణంలో 21.23 శాతం.
ఉమ్మడిఆంధ్రప్రదేశ్ లో 1995 లో ప్రకారంఅటవీ ప్రాంతం 47,112 చదరపు కిలోమీటర్లు కాగా 2003 లో 44,419 చదరపు కిలోమీటర్లకు తగ్గిపోయింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిననాడు (1995) 17.12 శాతంగా ఉన్న అటవీ ప్రాంతం ఆయన దిగిపోబోయే ముందు (2003) నాటికి 16.15 శాతానికి తగ్గింది.
ఇదే కాలంలో దేశవ్యాప్తంగా అటవీప్రాంతం 6,38,879 చదరపు కిలోమీటర్ల నుంచి 6,78,333 చదరపు కిలోమీటర్లకు, అంటే 19.43 శాతం నుంచి 20.64 శాతానికి పెరిగింది. మన పొరుగున ఉన్న తమిళనాడులో ఇదే కాలంలో అటవీ విస్తీర్ణం 17,049 చదరపు కిలోమీటర్ల నుంచి 22,643 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. అదే కాలంలో పశ్చిమబెంగాల్లో 8,276 చదరపు కిలోమీటర్ల నుంచి 12,343 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది.
చంద్రబాబు అధికారానికి దూరంగావున్న గత పదేళ్లలో (2003-2013 నివేదికల ప్రకారం) రాష్ట్రంలో అటవీ ప్రాంతం 1,697 చదరపు కిలోమీటర్లు పెరిగింది. పర్యావరణ పరిరక్షణ, అడవుల సంరక్షణ పట్ల చంద్రబాబు చిత్తశుద్ధి ఏపాటిదో ఈ అంకెలే వివరిస్తున్నాయి.
విభజనానంతర ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంత పరిస్థితి మరీ అన్యాయంగా ఉంది. రాష్ట్ర విస్తీర్ణం 1,60,204 చదరపు కిలోమీటర్లు కాగా అందులో అటవీ ప్రాంతం 24,357 చదరపు కిలోమీటర్లు. భౌగోళిక విస్తీర్ణంలో అటవీ ప్రాంతం 15.2 శాతం మాత్రమే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 16.86 శాతం, దేశం మొత్తం చూస్తే 21.23 శాతంతో పోలిస్తే నవ్యాంధ్రప్రదేశ్లో పర్యావరణ పరంగా ఎంతో బలహీనమైన పరిస్థితి నెలకొంది. తలసరి అటవీ విస్తీర్ణం కేవలం 12 సెంట్లుగా ఉంది.
బాక్సైట్ తవ్వకాల కోసం మూడు వేల ఎకరాల అడవిని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. రాజధాని లో నిర్మాణాల కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 49 వేల ఎకరాల అటవీ భూములను కూడా నిమిత్తం డీనోటిఫై చేయాలని కేంద్రాన్ని ఇప్పటికే కోరింది.
బిబిసి ఈ మధ్య ఒక వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. “రాబోయే కొద్దినెలల్లో ఆంధ్రప్రదేశ్ లో కోటి చెట్లను నరకి వేయబోతున్నారన్నది అందులో ప్రధానాంశం. పర్యావరణ పరిరక్షణకు, వర్షపాతం, శీతోష్ణ పరిస్థితుల్లో హెచ్చు తగ్గులకు అడవులు ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయన్న విషయంలో ప్రపంచలో సగటు మనిషి స్పృహ రాష్ట్రప్రభుత్వ ఆలోచనల్లోనే లేకపోవడం ప్రజల దురదృష్టం.