రియల్ ఎస్టేట్ రంగంలో ప్రి లాంచ్ ఆఫర్లు అంటే ఇళ్ల కొనుగోలుదారులు భయపడేలా స్కాములు చేశారు. దొరికిందే అవకాశం అని చెప్పి కింది స్థాయి నుంచి పెద్ద కంపెనీల వరకూ ప్రజల వద్ద వేల కోట్లు వసూలు చేసి జెండా ఎత్తేశారు. కొన్ని వందల కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో ప్రీలాంచ్ ఆఫర్ల పేర్లు వింటేనే చాలా మంది భయపడుతున్నారు.
అయితే బడా కంపెనీలు మాత్రం.. ప్రీలాంచ్ అనే పేర్లు లేకుండానే పెద్ద ఎత్తున ముందస్తు అమ్మకాలు చేసేస్తున్నాయి. వాటిని ఓ రకంగా ప్రీ లాంచ్ ఆఫర్లు అనుకోవచ్చు. ముఖ్యంగా హైరైజ్ అపార్టుమెంట్ల పేరుతో పేరున్న కంపెనీలన్నీ ప్రాజెక్టులు చేపడుతున్నాయి. వీటికి ముందుగానే బుకింగులు చేస్తున్నారు. అవి చేతికి వచ్చే సరికి మూడు , నాలుగేళ్లు పడుతాయని అందరికీ తెలుసు. అయినా అప్పటికి ఎస్ఎఫ్టీ పదిహేను వేలవుతుదని.. ఇప్పుడయితే ఎనిమిది నుంచి పది వేలే అని చెప్పి వసూలు చేసేస్తున్నాయి. ఇది మార్కెట్ రేటుకు కాస్త ఎక్కువే అయినా .. వారు ప్రచారం చేసే లగ్జరీస్.. సౌకర్యాలను చూసి జనం కట్టేస్తున్నారు.
ఇలాంటి ప్రీలాంచ్ ఆఫర్లలో ఇళ్లు కొనేటప్పుడు బడా కంపెనీల్లో అయినా సరే… ముందుగా కస్టమర్లు చూడాల్సింది రెరా అనుమతి. రెరాలో రియల్ ఎస్టేట్ సంస్థకు సభ్యత్వం ఉంటే సరిపోదు..ప్రతి ప్రాజెక్టుకు అనుమతి తీసుకోవాలి అలా అనుమతి తీసుకున్న ప్రాజెక్టుల్లో ప్రీలాంచ్ ఆఫర్లో ప్లాట్ బుక్ చేసుకున్నా కాస్త భద్రత ఉంటుంది. లేకపోతే సెక్యూరిటీ ఉండదు. ఎంత నమ్మకమైన బిల్డర్ అయినా… మోసం చేయాలని డిసైడైతే… మన డబ్బులు వసూలు చేసుకోవడం అసాధ్యమవుతుంది.
సాహితి ఇన్ ఫ్రా అనే కంపెనీ రెరా లో ఉన్నప్పటికీ ప్రీ లాంచ్ పేరుతో వేల కోట్లు వసూలు చేసింది. ఒక్కరికీ ఇల్లివ్వలేదు. కేసులయ్యాయి. కానీ కొద్ది రోజుల్లో జైల్లో ఉండి ఓనర్ హాయిగా తిరుగుతున్నాడు. కానీ డబ్బులు కట్టిన వారు మాత్రం మనోవేదనకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే.. ప్రీలాంచ్ ఆఫర్ల జోలికి వీలైనంత వరకూ వెళ్లకపోవడమే మించదని నిపుణుల సూచనలు.