రిషి సునక్ బ్రిటన్ ప్రధాని కాబోతూండటం భారతీయుల్ని.. అమితంగా సంతోషపరుస్తోంది. అమెరికా ఉపాధ్యక్షరాలిగా కమలాహారిస్ గెలిచినప్పుడు కూడా భారతీయులు ఇంతే సంతోషపడ్డారు. ఇది భారతీయుల విజయం అని.. ప్రపంచాన్ని జయిస్తున్నారని చెబుతున్నారు. సోషల్ మీడియాలో స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి వారి మూలాలు భారతీయతే కానీ.. వారి నరనరాన .. వారి దేశాలు అయిన అమెరికా, బ్రిటన్లే ఉంటాయి. ఆ విషయం అక్కడి ప్రజలకు తెలుసు. అందుకే పట్టం కట్టారు. భారత్తో డీల్ చేయాల్సిన పరిస్థితి వస్తే వారు మరింత కఠినంగా వ్యవహరిస్తారు. ఎందుకంటే.. ఎలాంటి లూప్ హోల్స్ ఉన్నా… దేశాన్ని ఇండియాకు తాకట్టు పెట్టారన్న విమర్శలు ఎదుర్కొంటారు.
వారు భారతీయ మూలాలున్నవారే కానీ.. భారతీయులు కాదు !
వారు భారతీయ మూలాలున్న వారే కానీ.. భారతీయులు కాదు. ఈ విషయం గుర్తించని వాళ్లు ఎక్కువ. ఇక్కడి సోషల్ మీడియా నిపుణులు వారేదో క్రికెట్ మ్యాచ్లో గెలిచేసిన ఇండియన్స్ అన్నట్లుగా చెలరేగిపోతూంటారు. నిజానికి వారి గెలుపు అక్కడి ప్రజల సందేశం. ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయింది. వలసలు వెళ్లిన వాళ్లు ఆయా దేశాల్లో పాలకులు అవుతున్నారు. వలసలన్నీ అభివృద్ధి చెందిన దేశాలకే ఉంటాయి.. నిజానికి వలసలు వెళ్లడం వల్లనే.. ఆయా దేశాలు అభివృద్ధి చెందాయి కూడా. అందుకే అక్కడ వారు మమేకం అయిపోయాయి.
తమ దేశాన్ని..బతుకుల్ని బాగు చేస్తారనుకున్న వారికే అక్కడి ప్రజల చాన్స్ !
కలం, మతం, ప్రాంతం అనే అడ్డుగోడలు కట్టుకోకుండా ఉండటం వల్లనే ఆయా దేశాలు ఇలా అభివృద్ధి చెందాయి. భారతీయ మూలాలున్న వారు పాలకులుగా ఎదుగుతున్నారు. కానీ ఇండియాలో ఏం జరుగుతోంది ? రాజకీయం అంటే కులం.. మన పాలుకులుగా ఎవర్నీ ఎన్నుకోవాలంటే కులాన్ని చూసుకుంటున్నాం.. తర్వాత మతాన్ని చూసుకుంటున్నాం…. ఆ తర్వాత ప్రాంతాన్ని చూసుకుంటున్నాం.. అంతే కానీ ఎవరు మంచి చేస్తారు..? ఎవరు బతుకుల్ని బాగు చేస్తారు అన్నది మాత్రం ఇప్పటికీ ప్రామాణికంగా తీసుకోలేకపోతున్నాం. అందుకే దేశం ఇంకా వెనుకబడే ఉంది.
వాళ్లు కుల, మత, ప్రాంతాలను చూసుకుంటే ఆ దేశాలు అభివృద్ధి చెందేవా ?
భారతీయ మూలాలున్న వారిని పాలకులుగా … సీఈవోలుగా ఎంచుకుటూ దేశాలు.. కంపెనీలు అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. కానీ వారే ఇండియాకు వస్తే ..రాజకీయాలు చేయాలనుకుంటే… వారికి కనీసం పది శాతం ఓట్లు కూడా రావు. ఎందుకంటే మన రాజకీయమే అంత. వారికి ఇక్కడి సమీకరణాలు ఏవీ సరిపోవు. ఆయా దేశాల్లో దేశాన్ని బాగు చేసే వారే రాజకీయ నాయకులు అవుతారు. కానీ భారత్లో కులాలు, మతాలు, ప్రాంాల మధ్య చిచ్చు పెట్టే వారే నేతలవుతారు. ఈ మర్మం తెలిసినా… తమకు అవే ముఖ్యమనుకునే ఓటర్లు ఉన్నంత కాలం భారత్ బాగుపడదు. వాళ్లు మారాలి !