వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందు ముందు సమాధానం చెప్పుకోలేని అతి పెద్ద ప్రశ్న ఎన్నార్సీ రూపంలో వెంటాడే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంట్లో దేశవ్యాప్తంగా ఎన్నార్సీ అమలు చేయడానికి అనుకూలంగా తెచ్చిన బిల్లుకు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతు తెలిపింది. ఓటింగ్లో పాల్గొంది. ఈ విషయం అప్పట్లో పెద్దగా హైలెట్ కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం.. అదే చర్చనీయాంశం అవుతోంది. వైసీపీ ప్రజాప్రతినిధుల్ని ముస్లింలు ఎక్కడికి వెళ్లినా అడ్డుకుంటూండటమే దీనికి సాక్ష్యం. ఎన్నార్సీని అమలు చేయబోమని ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ ముస్లింలు ఎవరూ నమ్మడం లేదు. దీనికి కారణం.. పార్లమెంట్లో మద్దతిచ్చారు. బీజేపీ అడుగులకు మడుగులు ఒత్తుతూనే ఉన్నారు.
అందుకే.. తెలంగాణలో కేసీఆర్ అసెంబ్లీలోనే ఎన్నార్సీకి వ్యతిరేక తీర్మానం చేస్తామని ప్రకటించినట్లుగా.. జగన్మోహన్ రెడ్డి కూడా.. ప్రకటన చేయాలన్న డిమాండ్ ముస్లిం వర్గాల నుంచి వస్తోంది. రాయలసీమలోనే ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది. జగన్కు ఎక్కువ డిమాండ్లు అక్కడి నుంచే వినిపిస్తున్నాయి. కడప జిల్లాలో ముస్లింలు ఓ రేంజ్లో ఫైర్ మీద ఉన్నారు. వారి ఆగ్రహాన్ని చూసి.. డిప్యూటీ సీఎం ఆంజాద్ భాషా కూడా భయపడాల్సి వస్తోంది. అవసరం అయితే.. పదవికి రాజీనామా చేస్తానని ఆయన చెబుతున్నారు. కేంద్రం ఎన్నార్సీపై ముందుకెళ్తే రాజీనామా చేస్తానని ఆయన చెబుతున్నారు. ఎవరేమైనా చేసుకోండి.. ఎన్నార్సీపై వెనక్కి తగ్గే ప్రశ్నే లేదని..మోడీ కుండబద్దలు కొట్టేశారు.
పార్లమెంట్లో కూడా మద్దతిచ్చారు కాబట్టి.. ఏపీలో అమలు చేయబోమనే అధికారం… ఏపీ సర్కార్కు లేదు. అలా కాకుండా.. అసెంబ్లీలో తీర్మానం చేస్తామంటే.. మాత్రం.. కేంద్ర ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఎందుకంటే.. మద్దతుగా ఓటేసిన రికార్డులు కేంద్రం దగ్గర ఉన్నాయి. ఈ విషయంలో వైసీపీ పరిస్థితి ముందు ముందు.. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా పరిస్థితి మారే అవకాశం కనిపిస్తోంది.