రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఆంధ్రాలో సీబీఐ అడుగుపెట్టడానికి వీల్లేదంటూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జనరల్ కన్సెంట్ ను ఉపసంహరించుకుంది. ఆ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ చేసిన తీవ్ర విమర్శలు అందరికీ గుర్తున్నవే. చంద్రబాబు పాలనలో వేల కోట్లు అవినీతి జరిగిందనీ, అవి బయటకి రాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారన్నది ఒక విమర్శ. ప్రతిపక్ష నేత జగన్ పై కోడి కత్తి దాడి నేపథ్యంలో… ఆ కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పటించాలంటూ పట్టుబట్టారు. ఒకవేళ సీబీఐకి ఈ కేసును అప్పగిస్తే… కుట్ర వెనక ఉన్నది చంద్రబాబు నాయుడే ఉన్నారని తేలిపోతుందన్న భయంతో రాష్ట్రంలోకి సీబీఐని రాకుండా చేశారంటూ ఇంకో విమర్శ చేశారు. ఇప్పడిదంతా ఎందుకంటే… వైకాపా వ్యక్తం చేసిన అనుమానాలు, చేసిన విమర్శల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఇప్పుడు చాలా స్పష్టమైంది కాబట్టి.
తమ అనుమతి లేకుండా సీబీఐ రాష్ట్రంలోకి రాకూడదని నిషేధం విధించాక… తొలిసారిగా ఇప్పుడు సీబీఐ రాష్ట్రంలోకి వస్తోంది. అది కూడా హైకోర్టు ఆదేశం ద్వారానే! ఆయేషా మీరా హత్య కేసును పునర్విచారణ చేయాలంటూ సీబీఐని హైకోర్టు ఆదేశించింది. అంటే, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ప్రవేశం లేదని రాష్ట్రం చెప్పిన తరువాత… సీబీఐ ఈ కేసు విచారణకు సిద్ధమౌతోంది. హైకోర్టుగానీ, సుప్రీం కోర్టుగానీ ఆదేశిస్తే… సీబీఐ తన పని తాను చేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. న్యాయస్థానం ఆదేశాలున్న తరువాత సీబీఐ ప్రవేశాన్ని, కేసులపై చేస్తున్న దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం కాదనే పరిస్థితి ఉండదు. ఇలాంటి సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధం సీబీఐని ఆపలేదు. నిషేధం తరువాత తొలి సీబీఐ విచారణ ఆయేషా మీరా కేసుతోనే అనొచ్చు.
ఈ వాస్తవాన్ని నిపుణులు, విశ్లేషకులు ఎంత స్పష్టంగా చెబుతున్నా… వైకాపా నేతలు మాత్రం జగన్ పై కోడి కత్తి దాడి కేసు కోసమే నిషేధం తెచ్చారంటూ చాలా విమర్శలు చేశారు. ఆ కేసు దర్యాప్తునకు కోర్టు ఆదేశిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునేది ఏదీ ఉండదనేది ఇప్పుడు స్పష్టమైంది. కనీసం ఇప్పుడైనా వాస్తవం తెలుసుకునే ప్రయత్నం చేస్తారో లేదో మరి! రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక.. కోడి కత్తి కేసులో దర్యాప్తును ప్రభావితం చేయాలనే ఉద్దేశం లేదనేది హైకోర్టు తాజా ఆదేశాల ద్వారా స్పష్టమైంది.