భారత్లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే ఖలిస్తానీ తీవ్రవాదులను వెనకేసుకు వస్తూ భారత్ పైనే నిందలు మోపుతున్న కెనడా వ్యవహారం రెండుదేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణం అవుతోంది. కెనడా పౌరుడు అవునో కాదో తెలియని హర్దిప్ సింగ్ నిజ్జర్ అనే ప్రకటిత ఖలీస్థానీ తీవ్రవాదిని ఎవరో హత్య చేశారు. ఆ హత్య చేయించింది ఇండియానేనని కెనడా ప్రధాని ట్రూడో అధారాల్లేకుండా కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా భారత దౌత్యవేత్తలను ఆ కేసులో అనుమానితులుగా చేర్చారు. దీంతో భారత్ కూడా ఆరుగురు కెనడా దౌత్యవేత్తల్ని బహిష్కరించింది. నిజ్జర్ హత్య వివాదం కారణంగా గతంలో వీసాల్ని నిలిపివేసుకునే పరిస్థితులు వచ్చాయి. తర్వాత సద్దుమణిగినా మళ్లీ కొత్తగా శత్రుత్వం పెరిగిపోతోంది.
భారత్లో వేర్పాటువాదానికి మద్దతిస్తున్న కెనడా
అసలు కెనడాకు భారత్ లో వేర్పాటువాదం అయిన ఖలీస్థానీ తీవ్రవాదులకు మద్దతివ్వాల్సిన అవసరం రాజకీయాల కారణంగానే వచ్చింది. చారిత్రకంగా కెనడాలో పంజాబ్ నుంచి వెళ్లిన సిక్కులు స్థిరపడిపోయారు. అక్కడ సిక్కుల జనాభా ఐదు శాతం వరకూ ఉంటుంది. సిక్కులంతా కొన్ని నగరాల్లోనే నివసిస్తూంటారు.ఈ కారణంగా వారికి రాజకీయంగానూ బలం వచ్చింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా పది మంది సిక్కు ఎంపీలు ఖచ్చితంగా గెలుస్తారు. సిక్కుల కోసం జగ్మీత్ సింగ్ అనే నాయకుడు ఓ పార్టీ పెట్టారు. ఆ పార్టీ కెనడాలో రాజకీయం చేసుకోక… భారత్లో ఖలీస్థానీ వేర్పాటువాదులకు మద్దతు ప్రకటిస్తుంది. ఆ పార్టీ మెప్పు కోసం ట్రూడో రాజకీయంల చేస్తున్నారు. భారత్ పై నిందలేస్తున్నారు.
కెనడా సిక్కులు ఖలీస్థాన్ సపోర్టర్లనే నిర్బంధ ముద్ర
కెనడాలో ఉన్న సిక్కులందరూ ఖలీస్థానీ వేర్పాటు వాదులు కాదు. కానీ అక్కడి సిక్కులకు మరో చాయిస్ లేకుండా చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే సిక్కుల మద్దతు అవసరం అని ట్రూడో ఖలీస్థానీ తీవ్రవాదుల పట్ల సానుకూలంగా ఉంటున్నారు. భారత్ ను శత్రుదేశం చేసుకునేందుకు కూడా తగ్గడంలేదు. అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటే కెనడాను అయినా భారత్ సహించే అవకాశం ఉండదు. ఖలీస్థాన్ వేర్పాటువాదం అనేది పంజాబ్ లో లేదు. బయట మాత్రమే ఉంది. వారికి కెనడా కేంద్రంగా మారింది. దాన్ని అంతం చేయాల్సిన కెనడా రెచ్చిపోతోంది. కెనడా వేర్పాటు వాదులు ఉంటే వారికి సపోర్టు చేస్తే కెనడాకు ఎలా రియాక్ట్ అవుతుందో భారత్ అంత కంటే రెట్టింపుగా రియాక్ట్ అవ్వాలన్నది భారత ప్రజల అభిప్రాయం.
కెనడాకు బుద్ది చెప్పాల్సిందే
ఇంత కాలం కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకుంటూ భారత్ లో వేర్పాటు వాదానికి ఉగ్రవాదం ద్వారా మద్దతు పలుకుతూ వచ్చింది పాకిస్థాన్. ఇప్పుడు పంజాబ్ లో వేర్పాటు వాదానికి మద్దతు ఇస్తూ పాకిస్తాన్ పక్కన కెనడా చేరింది. ఏ కారణంతోనూ కెనడా విషయం మెత్తబడకుండా … ఆ దేశానికి బుద్ది చెప్పాలని అందరూ కోరుకుంటున్నారు.