ఆంధ్రప్రదేశ్లో ఇరవై లక్షల వరకూ రేషన్ కార్డులు కట్ చేస్తున్నట్లుగా అధికారవర్గాలు ప్రకటించాయి. పేదల రేషన్ కార్డులు పోతున్నట్లుగా ప్రతిపక్షాలు దీనిపై గగ్గోలు పెట్టవచ్చు కానీ.. అనర్హులైన లక్షల కుటుంబాలకు..ఈ రేషన్ కార్డులు ఉన్నాయి. వాలంటీర్లతో నిర్వహించిన సర్వేలో ఇరవై లక్షల వరకూ రేషన్ కార్డులు అనర్హుల వద్ద ఉన్నట్లుగా గుర్తించి.. తీసివేతకు దాదాపుగా రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కోటి ఇరవై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుటుంబాలు ప్రభుత్వ లెక్కల ప్రకారం.. కోటి నలభై లక్షలు. అంటే.. 90 శాతానికిపైగా కుటుంబాల వద్ద వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. అనర్హుల్ని తీసేసిన తర్వాత కూడా రేషన్ కార్డు లేని.. కుటుంబాలు చాలా పరిమితంగానే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో 90 శాతానికిపైగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని భావించాల్సి వస్తుంది. కానీ రికార్డులు అలా లేవు.
ప్రభుత్వం అమరావతి భూములను క్రయవిక్రయాలను లెక్క తీస్తే.. వైట్ కార్డు ఉన్న వాళ్లే.. పెద్ద ఎత్తున కొన్నారన్న లెక్క తేలింది. నిజానికి వారంతా వైట్ కార్డు తీసుకునేంత పేదవాళ్లు కాదు.. ధనవంతులు అయినా… ప్రభుత్వం తరపున వచ్చే ప్రయోజనాలను పొందడానికి… ఏదో విధంగా.. రేషన్ కార్డు పొందారు. ఇలాంటి వారు.. లక్షల్లో ఉన్నారు. నిజానికి ఏపీలో సగానికి సగం కుటుంబాలకు రేషన్ కార్డు అర్హత ఉండదు. ప్రభుత్వం తరపున ఏ పథకం పొందాలన్నా.. వైట్ రేషన్ కార్డే అర్హతగా ఉంది. ప్రభుత్వాలు.. కూడా… ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం.. అడిగిన వారికి అడిగినట్లుగా వైట్ కార్డులు మంజూరు చేశాయి. ఫలితంగా.. అసలైన లబ్దిదారుల కన్నా… అనర్హుల వద్దే ఎక్కువగా ఉన్నాయి.
అందుకే.. జగన్మోహన్ రెడ్డి సర్కార్.. ఈ రేషన్ కార్డు మాత్రమే అర్హతగా కాకుండా ప్రతీ పథకానికి ఓ కార్డు మంజూరు చేయాలని నిర్ణయించింది. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, విద్యాదీవెన, పించన్ కానుక ఇలా అన్నింటికీ ఒక్కో కార్డు జారీ చేస్తారు. దీంతో.. రేషన్ కార్డులు పొందాలనే ఆలోచన ప్రజల్లో తగ్గిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయతే.. అన్నీ పక్కాగా అమలు చేస్తామని… అనర్హులకు పథకాలు అందనీయబోమని చెప్పుకొచ్చిన ప్రభుత్వం.. వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చింది. కానీ ఇప్పటి వరకూ అమలు చేసిన పథకాల్లో లోపాలు బయట పడుతున్నాయి. రాజకీయ పార్టీలు నిరసనలు వ్యక్తం చేసినా.. అనర్హుల్ని ఏరి వేస్తే..జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు మంచి పేరే వస్తుందనడంలో సందేహం లేదు.