తెలంగాణలో ఒక్క కాంగ్రెస్ తప్ప అన్ని పార్టీలు అభ్యర్థుల్ని ఖరారు చేశాయి. బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా అభ్యర్థుల్ని ప్రకటించింది. ఉంటారా వెళ్లిపోతారా అన్న అంశంపై చర్చలు జరుగుతున్నా కేసీఆర్ తగ్గలేదు. వీలైనంత వరకూ బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్సే ఎటూ తేల్చుకోలేకపోతోంది. సొంత బలం మర్చిపోయి… ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సీట్లు కేటాయిస్తోంది. ఇంకా ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూస్తున్నారేమో కానీ టిక్కెట్లు మాత్రం ప్రకటించడం లేదు.
ఇప్పటివరకు 9 సీట్లకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించారు. భువనగిరి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం నియోజకవర్గాలకు అభ్యర్థుల్నిప్రకటించాల్సి ఉంది. హైదరాబాద్ నియోజకవర్గానికి సుప్రీంకోర్టు న్యాయవాది షహనాజ్‌ను ప్రకటిస్తారని భావించినా మజ్లిస్ కు సహకరించేందుకు హిందూ అభ్యర్థిని పెట్టాలనే ఆలోచన చేస్తున్నారు. బీఆర్ఎస్ ముందుగానే హిందూ అభ్యర్థిని ప్రకటించింది.
భువనగిరి నుంచి చామల కిరణ్‌రెడ్డి అభ్యర్థిత్వంపై కోమటిరెడ్డి సోదరులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ టికెట్ కోసం పార్టీ కోసం పని చేసిన వారు ప్రయత్నిస్తున్నారు. అయినా సిట్టింగ్ ఎంపీని చేర్చుకున్నారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్ నుంచి అభ్యర్థులు రెడీగా ఉన్నా.. వారంతా బలమైన వాళ్లు కాదని.. వేరే పేర్లను పరిశీలిస్తూండటంతో మొదటికే మోసం వస్తోంది. ఎలా చూసినా అన్నీ స్థానాలకూ రెడ్డి పేర్లే తెరపైకి వస్తున్నాయి. ఖమ్మం కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఖరారు చేయనున్నారు.
అసలు పార్టీలో ఏం జరుగుతోంది? టికెట్ల ప్రకటనలో ఎక్కడ లోపం ఉంది? స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించిన పేర్లు ఎందుకు మారుతున్నాయని రాష్ట్ర కాంగ్రెస్‌లో చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతం కొత్తగా పార్టీలోకి చేరిన వెంటనే టికెట్లు ఇవ్వడంతో పార్టీలో లుకలుకలు వస్తున్నాయి. గెలుపు బాధ్యత రేవంత్ రెడ్డి మీద పెట్టినప్పటికీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయనకు తెలియని రాజకీయాలు నడుస్తున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.