కరోనా మృతుల కుటుంబాలకు రూ. నాలుగు లక్షలు ఆర్థిక సాయం చేసే ఆలోచన ఉందంటూ.. బాధితులకు ఆశలు రేపిన కేంద్రం చివరికి చేతులెత్తేసింది. ఒక్క రూపాయి కూడా కరోనా బాధితుల కుటుంబాలకు చెల్లించలేమంటూ సుప్రీంకోర్టుకు నివేదించింది. కరోనా వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు సాయం చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కరోనా అంశాలపై విచారణ జరుగుతున్నప్పుడే.. కేంద్రం తల్లిదండ్రులు ఇద్దర్నీ కోల్పోయిన పిల్లలకు రూ. పది లక్షలు సాయం ప్రకటించింది.
ఈ సందర్భంలో… మృతుల కుటుంబాలను కూడా ఆదుకుంటుందని అనుకున్నారు. అయితే అనూహ్యంగా కేంద్రం వెనుకడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కారణంగా దాదాపుగా నాలుగు లక్షల మంది చనిపోయారని.. వారి కుటుంబాలందరికీ పరిహారం ఇవ్వాలంటే… విపత్తు నిధులన్నీ కరిగిపోతాయని చెప్పింది. అందువల్ల ఇవ్వలేమని.. తేల్చేసింది. సుప్రీంకోర్టు ఈ అంశంపై ఎలా స్పందిస్తుందో కానీ.. కేంద్రం మాత్రం.. సాయం అనే మాటే లేదని తేల్చేసింది. కేంద్రం ఇవ్వలేమంటూ.. ఖచ్చితంగా ఇవ్వాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించే పరిస్థితి లేదు. దేశంలో కరోనా సృష్టించిన సంక్షోభం అంతా ఇంతా కాదు.
కుటుంబాలకు కుటుంబాలు నిర్వీర్యమైపోయాయి. చాలా ఇళ్లలో సంపాదించే పెద్ద దిక్కును కోల్పోయి దిక్కు తోచని కుటుంబాలు ఉన్నాయి. వీరందర్నీ ఆదుకోవడానికి కేంద్రం ఎలాంటి ఆలోచనలు చేయడం లేదు. నగదు రూపేణా ఇవ్వకపోయినా.. జీవనం కష్టమైన కుటుంబాలను గుర్తించి అయినా సాయం చేయాలన్న అభిప్రాయం వినిపిస్తోంది. కానీ కేంద్రం ఏం చేస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి.