ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరో తేదీన తన నివాసంలో సీబీఐ అధికారులు తన వద్ద వివరణ తీసుకోవచ్చని ఇంతకు ముందు ప్రకటించిన కల్వకుంట్ల కవిత హఠాత్తుగా షెడ్యూల్ మార్చేసుకున్నారు. ఆరో తేదీన ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు చాలా ఉన్నాయని..ఆ రోజు తాను తీరికగాలేనని ఆమె సీబీఐకి మెయిల్ కి చేశారు. ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో మీకు అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్ లోని తన నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. త్వరగా తేదీని ఖరారు చేయాలని పేర్కొన్నారు.
తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తునకు సహకరిస్తానని కవిత పునరుద్ఘాటించారు. దర్యాప్తునకు సహకరించడానికి గానూ పైన పేర్కొన్న తేదీల్లో ఒక రోజు సమావేశం అవుతానని లేఖలో తెలిపారు.సీబీఐ నుంచి నోటీస్ వచ్చిన తర్వాత వరసుగా రెండు రోజుల పాటు సీఎం కేసీఆర్తో సమావేశం అయ్యారు. ప్రగతి భవన్ నుంచే న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపారు. మొదట ఫిర్యాదు కాపీ, ఎఫ్ఐఆర్ కావాలని సీబీఐకి లేఖ రాశారు. ఆ రెండూ.. సీబీఐ వెబ్సైట్లో ఉన్నాయని పై నుంచి సమాచారం వచ్చింది.
దీంతో వెబ్ సైట్లో ఫిర్యాదు కాపీ, ఎఫ్ఐఆర్ను పరిశీలించిన కవిత.. వాటిలో తన పేరు లేదని నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయానని లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో తన పేరు ఎక్కడా లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. “సిబిఐ తన వెబ్ సైట్ లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ ని క్షుణ్ణంగా పరిశీలించాను మరియు అందులో పేర్కొని ఉన్న నిందితుల జాబితాను కూడా చూశాను. దానిలో నా పేరు ఎక్కడా లేదన్నారు. అయితే.. కవిత న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.