మద్యం తాగి ఓటేయడం నేరమని.. చెప్పి .. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో.. కొన్ని చోట్ల.. బ్రీత్ ఎనలైజింగ్ మిషన్లు పెట్టారన్న ప్రచారం జరిగింది. ఈ సారి ఇంకొంచెం ముందుకెళ్తోంది ఈసీ. ఓటింగ్ రోజు.. మద్యం షాపుల్ని సహజంగానే బంద్ చేస్తారు. ఈ సారి.. సిగరెట్ షాపుల్ని కూడా బంద్ చేయించాలని నిర్ణయించారు. సార్వత్రిక ఎన్నికలు జరిగే… అన్ని పోలింగ్ బూత్ల పరిధిలో సిగరెట్ దుకాణాలను మూసివేయాలని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంటే పోలింగ్ రోజు మద్యం దుకాణాలతో పాటు సిగరెట్లు అమ్మడం కూడా నిషేధించారన్నమాట. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, సిగరెట్ దుకాణాలపై నిషేధం అమల్లో ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేయబోతున్నారు.
ఒక్క సిగరెట్ మాత్రమే కాకుండా.. పొగాకు ఉత్పత్తులైన సిగరెట్, బీడీ, గుట్కా అన్నింటిపై ఈ నిషేధం అమల్లోకి వస్తుంది. ప్రిసైడింగ్ అధికారులు తమ బూత్ పరిధిలో సిగరెట్ దుకాణాలు మూత వేశాయా? లేదా? అనే అంశం పరిశీలించే నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం.. ఓ సంచలనాత్మక నిర్ణయమే తీసుకుంది. అయితే.. దీని వల్ల.. లాభం ఉంటుందా..? అంటే.. కనీసం ఓ అవగాహన కల్పించానికైనా పనికి వస్తుందనే సమాధానం వస్తోంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో గుట్కాలను నిషేధించారు. కానీ ఆ నిషేధం వల్ల గుట్కాల వినియోగం ఏ మాత్రం తగ్గలేదు. సరి కదా.. వాటిని బ్లాక్ మార్కెట్ చేసుకుని అక్రమ వ్యాపారులు బాగుపడ్డారు.
పోలింగ్ రోజు.. నిషేధం విధించడం వల్ల.. వాటి అమ్మకాలు… అర శాతం కూడా తగ్గవు. ఎందుకంటే.. నియంత్రణ ఉండదు. ఏ విధంగా అమ్ముకుంటారు. మాటలకు ఇలాంటి నిషేధం పెట్టడం కన్నా.. పకడ్బందీగా అమలు చేసినప్పుడే ప్రయోజనం ఉంటుంది. పోలింగ్ రోజు.. మద్యం దుకాణాలు బందే కానీ… మద్యం దొరకదనుకోవడం మాత్రం… అమాయకత్వం. ఈసీ విధించిన కొత్త రూల్ కూడా అలాంటిదే.. !