ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రెండు గంటల పాటు జరిగింది. రాజధానిని విశాఖకు తరలించాలంటూ.. జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికను.. మంత్రివర్గం ఆమోదిస్తుందని ప్రభుత్వ వర్గాలు.. విస్తృతంగా ప్రచారం చేస్తూ వచ్చాయి. అయితే అనూహ్యంగా.. చర్చ జరిగింది కానీ.. నిర్ణయం మాత్రం తీసుకోలేదని తెలుస్తోంది. మామూలుగా అయితే మంత్రివర్గ సమావేశం పూర్తయిన తర్వాత సమాచార పౌరసంబంధాల మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం పెట్టి వివరాలు చెబుతారు. ఈ సారి మాత్రం అలాంటి ప్రయత్నం చేయలేదు. మంత్రి కన్నబాబు మాత్రం.. రాజధానిపై.. జీఎన్ రావు ఇచ్చిన కమిటీ నివేదికపై చర్చ జరిగిందని చెప్పుకొచ్చారు.
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అనే మరో సంస్థకు రాజధానిపై అధ్యయానికి కాంట్రాక్ట్ ఇచ్చామని వారి నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని మీడియాకు చెప్పుకొచ్చారు. వచ్చే నెల మూడో తేదీన ఆ నివేదిక వస్తుందన్నట్లుగా.. వివరించారు. రాజధానిపై ప్రభుత్వం ఎన్ని కమిటీలు వేసిందో.. ఎవరికీ అర్థం కాని పరిస్థితి. మొదటగా.. సమగ్రాభివృద్ధి కోసమని.. జీఎన్ రావు కమిటీ నియమించారు. ఆ కమిటీ రాజధానులపై సిఫార్సులు చేసింది. తర్వాత ఐఐటీ రూర్కీకి చెందిన నిపుణుల కమిటీని నియమించినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ కమిటీ ఏమయిందో తెలియదు.. కొత్తగా బోస్టన్ కన్సల్టింగ్ అనే మరో సంస్థకు.. నివేదిక ఇచ్చినట్లుగా ప్రభుత్వం చెబుతోంది. ఈ నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నట్లుగా తాజాగా చెప్పుకొచ్చారు.
అయితే.. రాజధాని విషయంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని.. విశాఖకు తరలించడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. అయితే న్యాయపరమైన వివాదాలు తలెత్తుతాయని.. ఆ కమిటీలకు చట్టబద్ధత లేదన్న చర్చ జరుగుతోంది. దీంతో.. అసెంబ్లీ సమావేశాలు పెట్టి.. అసెంబ్లీలోనే రాజధాని మార్పుపై తీర్మానం చేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం.. నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టారని.. అంటున్నారు. మొత్తానికి ఈ రోజుకు అయితే.. కేబినెట్లో నిర్ణయం తీసుకోలేదని… చెబుతున్నారు. ఒక వేళ నిర్ణయం తీసుకుని ఉంటే… ఏ క్షణమైనా బయటకు వచ్చే అవకాశం ఉంది.