*మోసపోయామని రైతుల బాధ!
*అక్కడ ప్రజలు కూడా వుంటారా?
*అంతుచిక్కని అమరావతి రహస్యం?
అమరావతి మాస్టర్ ప్లాన్ ముసాయిదా మీద రాజధాని ప్రాంత ప్రజల అభిప్రాయాలు తీసుకోడానికి నిర్వహిస్తున్న సమావేశాలకు మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు హాజరుకావటం లేదు. దీంతో తాము మోసపోయామన్న బాధ భూములిచ్చిన రైతుల్లో కనబడుతోంది. ఈ సభల్లో ఏ ప్రశ్నకైనా ప్రశ్నలకు అధికారులు ”ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తాం” అని మాత్రమే సమాధానం చెబుతున్నారు.
లాండ్ పూలింగ్ కోసం ఈ ఇద్దరు మంత్రులూ ప్రతీ ఊరూ తిరిగారు…రైతుల ఇళ్ళకు వెళ్ళారు. భూమి ఇచ్చిన రైతులకు ఎకరానికి 800 గజాల వాణిజ్య స్ధలాన్ని, 200 గజాల ఇళ్ళస్ధలాన్ని అభివృద్ధి చేసి అదే గ్రామంలో ఇస్తామని నమ్మించారు. ఊరు వదలిపోయే అవసరమే లేదని భరోసా ఇచ్చారు.
మాస్టర్ ప్లాన్ ముసాయిదాలో మొత్తం ఇళ్ళస్ధలాలను మూడు నాలుగు చోట్ల చూపించారు. వాణిజ్య స్ధలాలు వున్నా అవి రైతులకు ఇచ్చేవి అని మార్క్ చేయలేదు. మాస్టర్ ప్లాన్ లో చూపించిన భారీ రహదారులు వేయాలంటే ఊళ్ళకు ఊళ్ళనే కూల్చి వేయవలసిన పరిస్ధితి వస్తుంది. మంత్రులు చెప్పింది ఏమిటి? ఇక్కడ జరగబోయేది ఏమిటి అని ఎవరిని అడగాలో తెలియని అనాధలైపోయారు రాజధాని ప్రాంతం గ్రామాల వారు. మంత్రులు రాకపోగా గుంటూరు సమావేశంలో “అభివృద్ది కోసం భూములివ్వక తప్పదు. ఆకాశంలో భవనాలు కట్టలేము కదా” అని ఎంపి గళ్ళా జయదేవ్ విసుగుదల ధోరణి చూపడం రైతలకు పుండు మీద కారం రాసినట్టయింది.
అసైన్డ్ భూముల పరిహారంపై ప్రకటన తప్ప మరే జీవో రాలేదు. గ్రామ కంఠాల నిర్ధారణపై స్పష్టమైన మార్గదర్శకాల్లేవు.ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాంతంలో రాజధాని నిర్మాణాన్ని ఎవ్వరూ వ్యతిరేకించలేదు. ప్రభుత్వం పాటిస్తున్న గోప్యతలో ఏదో మోసం వుందని నమ్ముతున్నారు. లాండ్ పూలింగ్ లో భూమి ఇవ్వడానికి స్వచ్చందంగా ముందుకి వచ్చిన వారే అసలు 38 వేల ఎకరాల అవసరం ఏముందని అడుగుతున్నారు. డినోటిఫై చేసిన 50 వేల ఎకరాల అటవీ భూములను ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
మొత్తం భూములన్నింటినీ స్వదేశీ, విదేశీ సంస్థలకు, కార్పొరేట్లకు కారు చవకగా కట్టబెట్టబోతున్నారని ఆందోళన చెందేవారి వాదనల్లో వాస్తవం వుందని ఈ పరిస్ధితులు బల పడుతున్నాయి. ప్రజా రాజధాని అని చెప్పి చివరికి అది ప్రజలు, భూములిచ్చిన రైతులు లేనిప్రైవేటు, కార్పొరేట్ కేపిటల్గా రూపొందుతోందని అర్థమవుతోంది. రూపాయి లేకుండా, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోకుండా, కేవలం అప్పులు తీసుకొని, కార్పొరేట్లకు భూములను ధారాదత్తం చేసి కేపిటల్ నిర్మించ తలపెడితే అందులో ప్రజలకు, రైతులకు స్థానం ఎక్కడ? ఇది కాకులను కొట్టి గ్రద్దలకు వేయడం కాదా?ఇదంతా చీమల పుట్టనుంచి చీమల్ని తరిమేసి పాములకు పుట్టని ఇచ్చేయడం కాదా?
లాండ్ పూలింగ్ సమయంలో తామే రాజధాని అన్నంత చురుకైన పాత్ర నిర్వహించిన మంత్రులు నారాయణ, పుల్లారావు సహచర మంత్రులలో అసూయ కలిగించారంటే అది అతిశయోక్తి కాదు. మాస్టర్ ప్లాన్ రావడానికి ముందునుంచే వారు ఈ వ్యవహారాలకు తెరమరుగైపోయారు. ఏంజరుగుతూందో తెలియని దశలో వారే వెనక్కు మళ్ళారని వారి సహచరులే విశ్లేషిస్తున్నారు. దీన్ని బట్టే మొత్తం విషయం ముఖ్యమంత్రికి తప్ప మరెవరికీ తెలియదని అర్ధమౌతోంది. ఈ గోప్యత ప్రమాదకరం…అనుమానాలు తలఎత్తుతున్నపుడైనా ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ముఖ్యమంత్రి మౌనం వీడాలి! లేని పక్షంలో ఏదో తప్పు జరిగిపోతూంది అన్న అనుమానాలు ఖరారైపోతాయి.