ఇస్తామన్న స్ధలాలను ఎప్పుడు కేటాయిస్తారు? కేటాయింపుల పై బాండ్లు ఎప్పుడు ఇస్తారు?ఈ లోగా సాగుకి ఎందుకు అనుమతించరు? అంటున్న రైతుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రులు ”అమరావతి” గ్రామాలకు వెళ్ళడం మానేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతానికి లాండ్ పూలింగ్ లో భూములిచ్చిన రైతుల ప్రశ్నలు ఇవి. ఊరూరూ తిరిగి భూములు ఇవ్వడానికి ఒప్పించిన మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ ఇపుడు ఏమైపోయారని రైతులు కోప్పడుతున్నారు.
నెక్కల్లు గ్రామంలో టిడిపి నాయకులే జన చైతన్య యాత్రను బహిష్కరించారు. భూమి రికార్డులు సరిగా లేవని, వాటిని సరిచేయాలని కోరినా పట్టించుకోవడం లేదన్నారు. పంచాయతీలో పనులు జరగడంలేదు. పూర్తి చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని నిలదీశారు. తెలుగుదేశం నాయకులంతా ఒకేమాట నిలవడంతో కార్యక్రమాన్ని నిర్వహించడానికి బయటినుంచి వచ్చిన నాయకులు వెనక్కి వెళ్ళిపోయారు.
వెంకటపాలెంలో రైతులు తమకు ఇవ్వవలసిన ప్లాట్లు ఎప్పుడిస్తారో చెప్పాలని జాయింట్ కలెక్టర్ చెన్నకేశవరావును నిలదీశారు. పార్టీపై అభిమానంతో భూములిచ్చామని, ఇవ్వాలని చెప్పిన నాయకులెవరూ ఇప్పుడు కనిపించడం లేదన్నారు. ప్లాట్లు ఇచ్చేందుకు నిర్ణీత గడువు చెప్పాలని, చెప్పకపోతే భూములు వెనక్కిచ్చేయాలని, లేకుంటే సాగుకన్నా అవకాశమివ్వాలని కోరారు.
రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల్లో అసహనం పెరిగిపోతోంది. పూలింగులో ఉన్న శ్రద్ధ తమకు వాటా ఇచ్చే సమయంలో లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులను నిలదీస్తున్నారు. భూములు ఇప్పించిన రాజకీయ నాయకులు ఇప్పుడు కనబడటం లేదని, గుంటూరు ఎంపి, మంత్రి నారాయణ చూద్దామన్నా రావడం లేదంటున్నారు. జనచైతన్య యాత్రలనూ బహిష్కరిస్తున్నారు,
అనంతవరం సభలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపైనా ఆగ్రహం వ్యక్తమైంది. పంచాయతీ సర్పంచులను ఏ మాత్రమూ లెక్క చేయడం లేదని నాయకులు జె.మధు, జి.వెంకటేశ్వరరావు, సర్పంచ్ సరళ వివరించారు. తమ సమస్యలు ఎందుకు పట్టించుకోరా ప్రశ్నించారు. ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అన్ని గ్రామాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.
రాజధాని ప్రకటించిన తొలిరోజే భూములిచ్చామని, ఇంతవరకు ప్లాట్లు ఎక్కడిస్తారో చెప్పడం లేదని టిడిపి నాయకులను ప్రశ్నించారు. ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకత తట్టుకోలేక మంత్రి నారాయణ ఆ వైపునకు వెళ్లడం లేదు. ఎంపి గల్లా జయదేవ్ రాజధాని ప్రాంతంలోకి రావడమే కష్టంగా మారింది. ముఖ్యమంత్రి వస్తే మినహా ఆయా గ్రామాల్లోకి వారు వెళ్లే పరిస్థితి లేదు. నారాయణకు తొలిరోజే తీవ్ర వ్యతిరేకతొచ్చింది. దీంతో ఆయన ముఖం చాటేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేపై టిడిపిలో ఒక వర్గం తీవ్ర వ్యతిరేకతతో ఉంది.
అమరావతి ప్రాంతంలో మెట్ట రైతుల సమస్యలు మరొక విధంగా ఉన్నాయి. ఆ గ్రామాల్లో మంచినీరు లేదు. ట్యాంకులున్నా నిరుపయోగమే స్థానిక ప్రజాప్రతినిధులకు విలువ లేదు. సర్పంచులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఎంపిటిసిలు, జెడ్పిటిసిలు నామమాత్రంగా మారారు. గ్రామాల్లో ఉపాధి లేదు. దీంతో ఆయా గ్రామాల్లో రైతులు పార్టీలకు అతీతంగా ఎదురు తిరుగుతున్నారు.
రాజధాని ప్రాంతం వ్యవహారాల్ని ముఖ్యమంత్రే స్వయంగా చూస్తూండటం, ఈ ప్రాంతం ‘కేపిటల్ రీజియన్ డెపలప్ మెంటు అధారిటీ’ పర్యవేక్షణలో వుండటంతో గ్రామాల్లోని సాధారణ పరిపాలన స్ధభించి పోయినట్టయింది. ఇదికూడా ప్రజల ఆగ్రహానికి ఒక కారణమే!