ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఉత్తరాంధ్రలో వివిధ సంఘాలు, రాజకీయ పార్టీల కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర పేరుతోనే ఎక్కువగా జరుగుతూ ఉండటం ఆసక్తి రేపుతోంది. ఇటీవల శ్రీకాకుళం నుంచి గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి 30వేల ఓట్లు మాత్రమే పొందిన రామారావు అనే నేత .. ఏకంగా జై ఉత్తరాంధ్ర అనే పార్టీని పెడుతున్నారు. తాజాగా ఉత్తరాంధ్ర చర్చా వేదిక తెరపైకి వచ్చింది. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ దీనికి నాయకుడు.
ఆయన ఉత్తరాంధ్ర సీనియర్ నేతలందర్నీ పిలిచి చర్చా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఉత్తరాంధ్ర అభివృద్ది రూ. యాభై వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు కానీ.. ఎవరూ విశాఖను రాజధాని చేయాలని డిమాండ్ చేయలేదు. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు, లోక్ సత్తా నేత జేపీ, కమ్యూనిస్టు పార్టీల నాయకులు, కొణతాల రామకృష్ణ, పలువురు ఉత్తరాంధ్ర నేతలు ఇందులో పాల్గొన్నారు. అందరూ కీలకమైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాలపై మాట్లాడారు. అయితే రాజధాని వస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి అవుతుందని ఒక్కరూ అభిప్రాయం వ్యక్తం చేయలేదు.
రాజధాని పేరుతో వైసీపీనే హడావిడి చేస్తోంది. ఆ పార్టీ సానుభూతి పరులు విశాఖ రాజధాని పేరుతో అప్పట్లో జేఏసీగా మారి హడావుడి చేశారు. ఇప్పుడు వారందర్నీ వైసీపీనే పక్కన పడేసింది. రాజధాని పేరుతో వారిని నాయకులుగా ఎదిగేలా చే్యడం ఎందుకని పక్కన పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే రాయలసీమ మేధావి పేరుతో పురషోత్తంరెడ్డి తరచూ ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయనను వైసీపీనే ప్రోత్సహించింది. కారణం ఏదైనా.., ఉత్తరాంధ్ర మేధావులు.. తమ ప్రధాన డిమాండ్లలో రాజధానిని చేర్చకపోవడం ఆసక్తికరం.