రాజధానికి భూములిచ్చిన రైతులకు రోజూ మానసిక వేదన తప్పడం లేదు. సమయానికి కౌలు కూడా ఇవ్వడం లేదు. రైతులు న్యాయపోరాటం కోసం కోర్టుల్లో పిటిషన్లు వేసిన తర్వాతే ప్రభుత్వం స్పందిస్తోంది. రాజధాని రైతులకువార్షిక కౌలు ఈ ఏడాది ఇంత వరకూ విడుదల చేయలేదు. దాంతో రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వం ఒప్పందాల్ని ఉల్లంఘించి.. కౌలును విడుదల చేయడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ రేపోమాపో విచారణకు వచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వం హడావుడిగా కౌలు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది.
రాజధానికి భూములిచ్చిన రైతుల కౌలుకు 195 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి ఉత్తర్వులు ఇచ్చారు. గత ఏడాది కూడా రైతులు కౌలు కోసం అదే పనిగా పోరాటం చేయాల్సి వచ్చింది. చివరికి హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాతనే స్పందించారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి. గత ప్రభుత్వం .. అమరావతి రైతుల కౌలు.. మేలో… నేరుగా నగదు బదిలీ చేసేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి విషయాన్ని పూర్తిగా మరుగున పడేయడంతో పాటు .. రైతులకు ఇవ్వాల్సిన కౌలును కూడా… ఆలస్యం చేస్తున్నారు.
దీని కోసం రైతులు కోర్టును ఆశ్రయిస్తే తప్ప.. ప్రభుత్వంలో కదలికలు రావడం లేదు. ఇప్పటికి ప్రతీ దానికి రాజధాని రైతులు.. కోర్టు ద్వారానే ఊరట పొందాల్సి వస్తోంది. కనీసం మంజూరు చేస్తామన్న పెన్షన్లు కూడా.. ప్రకటనలకే పరిమితమయ్యాయి. అయితే కోర్టుల భయంతో అయినా కౌలు మంజూరు చేస్తున్నందుకు రైతులు ఊరట పడుతున్నారు.