రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు. సీఎం ఎక్కడ ఉంటే.. అక్కడే రాజధాని.. అంటూ.. అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆయన నోటిమాటగా ఈ వ్యాఖ్యలు చేయలేదని.. ఓ ప్రణాళిక ప్రకారమే.. చేశారని భావిస్తున్నారు. దీనికి కారణం రాజధాని తరలింపులో ఎదురవుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని.. రాజ్యాంగంలో రాజధానిలో లేదు కాబట్టి.. చట్టాలు.. గిట్టాలు అవసరం లేకుండా.. తాను .. తన ఇష్టం వచ్చినట్లుగా రాజధానిని ఎక్కడ కావాలంటే అక్కడ ఏర్పాటు చేసుకుని పరిపాలిస్తా.. ఎవరు అడ్డొస్తారో చూస్తానన్నట్లుగా ఆయన వాదిస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది.
రాజ్యాంగంలో రాజధాని లేదని కొత్త విషయం చెప్పిన జగన్..!
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని గుర్తించడానికి జగన్మోహన్ రెడ్డి అసలు మొదటి నుంచి ఆసక్తిగా లేరు. ఆయన గుర్తించకపోతే .. అది వ్యక్తిగత సమస్య అనుకున్నారు కానీ.. అసలు రాజధాని అనే దానికి రాజ్యాంగంలో చోటే లేదని ప్రకటించడం.. చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. రాజ్యాంగంలో రాజధాని ప్రస్తావన ఉందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ” నేషనల్ కేపిటల్ రీజియన్ ” ఎన్సీఆర్ ప్రస్తావన రాజ్యాంగంలో ఉందని.. ఆ రీజియన్ పరిధిలోనే.. ఢిల్లీ ఉందని.. నిపుణులు చెబుతున్నారు. కానీ.. జగన్మోహన్ రెడ్డికి ఎవరు.. ఏ సమయంలో.. రాజ్యాంగంలో రాజధాని లేదు అని సలహా ఇచ్చారో కానీ ఆయన అసెంబ్లీలోనే ప్రకటించేశారు. ఇది ఇప్పుడు.. కొత్త చర్చకు కారణం అవుతోంది. ముఖ్యమంత్రి అమాయకత్వమా.. లేక తాను.. అనుకున్నది నిరూపించుకోవాలన్న పట్టుదలతో దేనికైనా సిద్ధపడటమా అన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
అలా అయితే.. ఈ చట్టాల కోసం ఎందుకంత ఆరాటం..!?
అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం.. రాజధాని అనేదానికే అసలు ఉనికి లేదు. తాను ఎక్కడ నుంచి అయినా పరిపాలన చేయవచ్చు. ఎక్కడ నుంచి అయినా చట్టాలు చేయవచ్చు. అలాంటప్పుడు..జగన్మోహన్ రెడ్డి.. పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో ఎందుకు చట్టాలు చేస్తున్నారు..? కేబినెట్ తీర్మానాలు… బోస్టన్, జీఎన్ రావు కమిటీలతో ఎందుకు రిపోర్టులు తెప్పించారు..? అందరి కన్నా ముందుగా తన వాదన ఎందుకు వినిపించారు..? శాసనమండలి.. ఆ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపే వరకూ.. జగన్మోహన్ రెడ్డికి అసలు.. తాను ఎక్కడి నుంచి పరిపాలిస్తే.. అదే రాజధాని అన్న విషయం ఎందుకు గుర్తుకు రాలేదు…? ఇవన్నీ.. సీఎం ప్రకటన తర్వాత చాలా మందికి వస్తున్న సందేహం. చట్టాలు చేయలేక.. తన నిర్ణయాలను… అమలు చేయలేక జగన్మోహన్ రెడ్డి.. రాజ్యాంగం పేరుతో.. కొత్త డ్రామా ఆడుతున్నారన్న విమర్శలు పెరగడానికి ఇది కారణం అవుతోంది.
ఏ వ్యవస్థనూ లెక్క చేయకుండా తరలించడానికే సిద్ధమయ్యారా..?
జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల ప్రకారం చూస్తే.. శాసన వ్యవస్థను.. న్యాయవ్యవస్థను కూడా లెక్క చేయకుండా.. తాను అనుకున్నట్లుగా విశాఖకు రాజధానిని తరలించడానికి సిద్ధమయ్యారన్న అభిప్రాయం.. ఆయన పనితీరును గమనిస్తున్న వారు వ్యక్తం చేస్తున్నారు. తనకు 151 సీట్లు వచ్చాయని.. ప్రజాభిప్రాయం తన వైపు ఏకపక్షంగా ఉందని.. అయినా తనను ఈ వ్యవస్థలు అడ్డుకోవడం ఏమిటన్న భావనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లుగా చెబుతున్నారు. అందుకే.. రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదని.. తాను ఎక్కడి నుంచి అయినా చట్టాలు చేస్తానని.. ఎక్కడి నుంచి అయినా పరిపాలన చేస్తానని.. సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అని చెప్పుకొస్తున్నారు. బహుశా .. త్వరలో ఇదే జరగనుందని అంటున్నారు.