తమిళ సినిమాలు తెలుగులో కూడా మంచి విజయాల్ని అందుకుంటాయి. రజనీకాంత్, కమల్ హసన్, సూర్య, కార్తి విజయ్ తో పాటు ధనుష్, శివకార్తికేయన్ లాంటి హీరోల చిత్రాలకు ఇక్కడ ఆదరణ వుంటుంది. తమిళ్ లో మంచి టాక్ తెచ్చుకున్న ‘లవ్ టుడే’ లాంటి చిత్రాలు ఇక్కడ కూడా మంచి వసూళ్లు సాధించాయి. అయితే రానున్న శుక్రవారం తెలుగులో విడుదల కాబోతున్న రెండు తమిళ సినిమాల పరిస్థితి మాత్ర కాస్త భిన్నంగా వుంది.
ధనుష్ కెప్టన్ మిల్లర్ జనవరి 25న వస్తోంది. శివకార్తికేయన్ ఆయాలన్ 26న వస్తోంది. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి తెలుగులో కూడా రావాల్సింది. కానీ థియేటర్స్ కొరత వలన కుదరలేదు. ఐతే ఈ చిత్రాల తమిళ వెర్షన్స్ రిజల్ట్ ఆల్రెడీ తెలిసిపోయింది. పొంగల్ కానుకగా అక్కడ విడుదలైన ఈ రెండు చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోయాయి. కెప్టన్ మిల్లర్ పిరియాడిక్ యాక్షన్ డ్రామా. అణిచివేత, తిరుగుబాటుని నేపధ్యంగా తీసుకొని తమిళ్ ప్లేవర్ లో తీర్చిద్దిదిన ఈ చిత్రంపై అక్కడ ప్రేక్షకులు పెదవి విరిచారు. సినిమా మేకింగ్ పరంగా బావుంది కానీ ప్రేక్షకులని అలరించే సినిమా కాలేకపోయిందనే విమర్శలు వచ్చాయి. శివకార్తికేయన్ ఆయాలన్ సైంటిఫిక్ థ్రిల్లర్. ఈ సినిమా ఐడియా బావుంది కానీ ఆచరణలో మళ్ళీ రొటీన్ హీరో విలన్ టెంప్లెట్ ని అనుసరించారనే విమర్శలు వచ్చాయి. మొత్తానికి ఈ రెండూ సినిమాలకి పూర్తిగా పాజిటివ్ టాక్ రాలేదు. మరి తెలుగు ప్రేక్షకుల తీర్పు ఎలా వుంటుందో చూడాలి.