Captain Miller Movie review
తెలుగు360 రేటింగ్: 2.5/5
ధనుష్ నటనే కాదు ఆయన కథల ఎంపిక కూడా విలక్షణంగా వుంటుంది. ‘సాని కాయిదం’ చిత్రంతో అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శకుడు అరుణ్ మథేశ్వరన్ తో ఇప్పుడో పిరియాడిక్ యాక్షన్ డ్రామాని చేశారు. అదే.. కెప్టెన్ మిల్లర్. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం థియేటర్స్ సమస్య కారణంగా తెలుగు వెర్షన్ ఇప్పుడు రిపబ్లిక్ డేకి వచ్చింది. ‘సార్’ తర్వాత ధనుష్ నుంచి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమిది. మరి ఈ మిల్లర్ ఆయన్ని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ చేసిందా? ఈ కెప్టెన్ పోరాటం ఆకట్టుకుందా?
అది 1930. దేశాన్ని బ్రిటీషర్లు పాలిస్తున్న కాలం. 600 ఏళ్ల చరిత్ర ఉన్న శివాలయం వున్న ఊరది. ఆ ఊర్లో వెనుకబడిన తరగతికి చెందిన కుర్రాడు అగ్ని(ధనుష్) చిన్నప్పటి నుంచి అతనికి అన్నీ అవమానాలే. ఆ ఊర్లో వున్న శివాలయంలో అడుగుపెట్టడానికి అతని వర్గానికి అనుమతి లేదు. కానీ ఆ శివాలయ నిర్మాణనికి కారణం అతని వర్గం వారే అని అక్కడ చరిత్ర చెబుతుంటుంది. మరోవైపు అగ్ని సోదరుడు శివన్న (శివ రాజ్ కుమార్) బ్రిటీషర్లకు వ్యతిరేకంగా స్వతంత్య్ర పోరాటం చేస్తుంటాడు. అగ్ని మాత్రం బ్రిటష్ సైన్యంలో చేరాలని నిర్ణయించుకుంటాడు. సైన్యంలో చేరిన అగ్ని పేరుని మిల్లర్ గా మారుస్తారు అధికారులు. బ్రిటిష్ సైనికుడిగా మారిన అగ్నికి ఒక అనూహ్యమైన సంఘటన ఎదురౌతుంది. దీంతో అతడి ప్రయాణమే మారిపోతుంది. ఆ తరవాత బ్రిటిష్ సైన్యం వెదికే మోస్ట్ వాంటెండ్ క్రిమినల్ గా మారిపోతాడు మిల్లర్. తర్వాత ఏం జరిగింది? అసలు అగ్ని సైన్యంలో చేరాలని ఎందుకు అనుకున్నాడు? బ్రిటిష్ సైన్యం అతడి కోసం ఎందుకు గాలిస్తుంది? ఈ కథలో ఊరి శివాలయం చరిత్ర ఏ పాత్రని పోషించింది? తన ఊరి కోసం మిల్లర్ ఎలాంటి పోరాటం చేశాడు? ఇవన్నీ తెరపై చూడాలి.
కొన్ని కథలు నిజంగా ఆలోజింపచేసేలా వుంటాయి. కెప్టెన్ మిల్లర్ పాయింట్ కూడా అలాంటిదే. ఒక గుడి చరిత్రని చెబుతూ.. ఒక రాజుని, అణిచివేయబడ్డ ఒక వర్గాన్ని, బ్రిటీష్ పాలనని, స్వతంత్ర పోరాటాన్ని.. ఇలా నాలుగు కోణాల్లో కథని ఆసక్తికరంగా మొదలుపెట్టాడు దర్శకుడు. స్వరాజ్యం కోసం పోరాటం చేస్తుంటాడు శివన్న. స్వరాజ్యం వస్తే స్వేచ్ఛ దొరుకుతుందనేది అతడి ఉద్దేశం. స్వరాజ్యం వచ్చినా తమ బ్రతుకుల్లో మార్పు ఉండదని, సమాజంలో తగిన గౌరవం దొరకదనే ఆవేదన అగ్ని పాత్రలో వుంటుంది. బ్రిటిష్ దొర పాలిస్తాడు, వాడు వెళ్ళిపోతే ఇంకొ దొర వస్తాడు తప్పితే తమ వర్గానికి అణిచివేత తప్పదనే నిరాశలో వున్న అగ్ని.. కనీసం బ్రిటిష్ సైన్యంలో ఉంటే ఓ యూనిఫాం ఇచ్చి గౌరవంగా చుస్తారని భావించి అందులో చేరుతాడు. సైన్యంలో చేరిన తర్వాత అగ్నికి ఎదురయ్యే ఒక ఘటన ప్రేక్షకుడికి ఎమోషనల్ హై మూమెంట్ ఇస్తుంది. దీంతో ఈ కథపై అంచనాలు అమాంతం పెరుగుతాయి. అయితే ఆ అంచనాలని తారుమారు చేస్తూ అక్కడి నుంచి ఈ కథని నిస్సారంగా నడిపిన వైనం ప్రేక్షకుడిలో నిస్తేజం ఆవరించినట్లుగా చేస్తుంది.
మిల్లర్ పాత్రకు మొదటి నుంచి ఒక లక్ష్యం అంటూ వుండదు. ప్రతి పాత్రకు లక్ష్యం ఉండాల్సిన పని లేదు కానీ ప్రేక్షకుడికి మాత్రం తెరపై జరుగుతున్న సన్నివేశాలన్నీ ఒక లక్ష్యం వైపు వెళుతున్నాయనే అనుభూతిని కలిగించాలి. అప్పుడే కథలో జరుగుతున్న సన్నివేశాలకు కనెక్ట్ ఆవ్వగలడు. కెప్టెన్ మిల్లర్ తో అలాంటి ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయ్యింది. మిల్లర్, రెబల్ గా మారిన తర్వాత తన ప్రయాణం ఎటు అనే సంగతి క్లారిటీ లేకుండా వుంటుంది. ఒక దశలో అసలు ఇందులో ఏ పాయింట్ దర్శకుడు బలంగా చెప్పాలని అనుకుంటున్నాడో అర్ధం కాదు. చాలా సన్నివేశాలు గడిచిన తర్వాత ఇది శివాలయం చరిత్ర, దాన్ని నిరూపించడానికి జరుగుతున్న ప్రయాణం అనిపిస్తుంది. ఇందులో హీరో పాత్రని చాలా సంక్లిష్టంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. అతని పాత్రలో కొన్ని లేయర్స్ వుంటాయి. సమస్య ఏమిటంటే అవి ప్రేక్షకుడి రిజిస్టర్ కావు. ఈ కారణంగానే ఇంటర్వెల్ ఎపిసోడ్ లో అతడు సిలోన్ వెళ్ళిపోతానన్నప్పుడు ప్రేక్షకుడిలో ఎలాంటి ఎమోషన్ రాదు. సెకండ్ హాఫ్ లో ఈ కథ అంతా శివాలయం చుట్టూ తిరుగుతుంది. సెకండ్ హాఫ్ లో యాక్షన్ పార్టే ఎక్కువ. వరుసగా మూడు భారీ యాక్షన్ సీక్వెన్స్ లు వస్తాయి. అయితే ఆ యాక్షన్ లోని ఎమోషన్ ఏమిటనేది ప్రేక్షకుడికి అంతగా పట్టదు. యాక్షన్ సీక్వెన్స్ లని బాగా తీశారు కానీ కొన్ని మాత్రం సహజత్వానికి దూరంగా వుంటాయి. వార్ ఎపిసోడ్స్ లో అలా బుల్లెట్లు పేలుతూనే వుంటాయి. ఒక దశలో రిపీట్ సౌండ్లు, సీన్స్ చూస్తున్నామా? అనే భావన కూడా కలుగుతుంది. అన్నట్టు ఈ చిత్రానికి ఓపెన్ ఎండింగ్ ఇచ్చి పార్ట్ 2 కి లీడ్ ఇచ్చారు.
ధనుష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో మూడు భిన్నమైన గెటప్స్ లో కనిపించే అవకాశం వచ్చింది. సాధారణ యువకుడిగా, సైనికుడిగా, రెబల్ గా ఇలా మూడు గెటప్స్ లోనూ వైవిధ్యం చూపించాడు. యాక్షన్ సీక్వెన్స్ లలో మంచి ఈజ్ కనపరిచాడు. కెప్టెన్ మిల్లర్ ధనుష్ వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. అతని కోసమే ఈ సినిమా చూడగలం. తనే ఈ సినిమాని కాపాడగలిగే అస్త్రం. మిల్లర్ పాత్రలో అసురన్, కర్ణ ఛాయలు కూడా కనిపిస్తాయి. శివన్న పాత్రలో కనిపించిన శివరాజ్ కుమార్ ది గెస్ట్ రోల్ లాంటి పాత్రే. నాలుగు సీన్స్ వుంటాయి. చివర్లో జైలర్ టైపులో ఎంట్రీ ప్లాన్ చేశారు కానీ ఈ వార్ యాక్షన్ లో అది సరిగ్గా కుదరలేదు. భానుమతి పాత్రలో చేసిన ప్రియాంక ఆరుళ్ మోహన్ పాత్రలో స్పష్టత కొరవడింది. ఆ జమిందారి కుటుంబంలో తన వరస ఏమిటనేది ఆ పాత్ర చేసిన ఆమెకు కూడా ఖచ్చితంగా తెలీదు. తన నటన మాత్రం రొటీన్ కి భిన్నంగా వుంది. రఫీ పాత్రలో చేసిన సందీప్ కిషన్ ది మరో గెస్ట్ రోల్ అనుకోవాలి. కాళీ వెంకట్, జయప్రకాశ్ తో పాటు మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.
టెక్నికల్ గా మిల్లర్ కు మంచి మార్కులు పడతాయి. జీవీ ప్రకాష్ నేపధ్య సంగీతం ఇంపాక్ట్ ఫుల్ గా చేశాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లలో చేసిన బీజీఎం అదిరింది. సిద్ధార్థ నుని కెమరాపనితనం ఆకట్టుకుంటుంది. విజువల్స్ ప్రేక్షకుడిని బ్రిటిష్ కాలానికి తీసుకెళ్ళాయి. రామలింగం ప్రొడక్షన్ డిజైన్ బావుంది. అన్నీ రియల్ లొకేషన్ లో చేసి ఒక వింటేజ్ ఎఫ్ఫెక్ట్ ని తీసుకొచ్చారు. ప్రొడక్షన్ కోసం పడిన కష్టం తెరపై కనిపించింది. తెలుగు డబ్బింగ్ ని మాత్రం తేలికగా తీసుకున్నారనిపించింది. సింక్ మాట పక్కన పెడితే డైలాగ్స్ లో ఒక ఒక ఫ్లో వుండదు. ఎంచుకున్న పదాలు కూడా ఒకటి గ్రాంధికం, మరొకటి వ్యవహారికం, ఇంకొకటి జానపదం.. ఇలా పదాలని అల్ మిక్స్ పచ్చడి చేసిపారేశారు. టైటిల్స్, సబ్ టైటిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. టైటిల్స్ లో క్షమించరాని దోషాలు వున్నాయి. గూగుల్ ట్రాన్స్ లేటర్ వాడి తెలుగు టైటిల్స్ వేయడం హాస్యాస్పదం. డబ్బింగ్ విషయంలో నిర్మాతలు తీసుకున్న అశ్రద్దకి ఇది అద్దం పడుతోంది. కనీసం తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాతలైన చూసుకోవాలి కదా. ఓవరాల్ గా కెప్టెన్ మిల్లర్ చెప్పుకోదగ్గ రెండు ఎమోషనల్ సీన్స్, మూడు యాక్షన్ సీక్వెన్స్ వున్న పిరియాడిక్ యాక్షన్ డ్రామా. అయితే ఈ హైలెట్స్ ని ఆస్వాదించాలన్నా కాస్త ఓపిక తెచ్చుకొని చూడాలి.
తెలుగు360 రేటింగ్: 2.5/5