రానున్న నాలుగేళ్ళలో భారత్ లో కార్ల ధరలు చాలా భారీగా పెరిగే అవకాశం ఉందని ఆటోమొబైల్ రంగానికి చెందిన నిపుణులు తెలియజేస్తున్నారు. 2020 సం.నాటికి దేశంలో వాయు కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలలో భాగంగా కార్ల తయారీ సంస్థలన్నీ బి.ఎస్.-VI ఆధునిక కాలుష్య నివారణ సాంకేతిక వ్యవస్థని కార్లలో ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కారి ఒక ట్వీట్ మెసేజ్ లో ఏప్రిల్ 1,2020నుండి ఈ ఆధునిక కాలుష్య నివారణ పరిజ్ఞానాన్ని దేశంలో అమలులోకి తీసుకురావాలనుకొంటున్నట్లు తెలపడంతో కార్ల తయారీ సంస్థలన్నీ ఉలికిపడ్డాయి. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం అప్పుడే సూత్రప్రాయంగా ఒక నిశ్చయానికి వచ్చిందని గడ్కారీ పెట్టిన ఆ ట్వీట్ మెసేజ్ తెలియజేస్తునట్లే భావించవచ్చును. యూరోపియన్ దేశాలలో బి.ఎస్.-IV నుండి బి.ఎస్.-VI స్థాయికి మార్పు చెందడానికి సుమారు పదేళ్ళు పట్టింది. కానీ భారత్ లో కేవలం నాలుగేళ్ళలోనే అది సాకారం చేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది.
ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేసేందుకు ఒక్కో కార్ల తయారీ సంస్థ కనీసం రూ.50-80,000 కోట్లు అధనంగా పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. కార్ల కంపెనీలన్నీ సహజంగానే ఆ భారాన్ని కొనుగోలుదార్లకి బదలాయిస్తాయి కనుక కార్ల ధరలు కనీసం 8-18 శాతం వరకు పెరిగే అవకాశం ఉంటుందని చెపుతున్నారు. అదికాక ఈ మధ్యకాలంలో పెరిగే ముడి వస్తువుల ధరలు, రకరకాల పన్నులు వంటివన్నీ ఆ ధరను మరింత పెంచుతాయని వేరే చెప్పనవసరం లేదు.
ఈ బి.ఎస్.-VI ఆధునిక కాలుష్య నివారణ సాంకేతిక వ్యవస్థని కేవలం కార్లలోనే ఏర్పాటు చేయడం వలన పెద్దగా ప్రయోజనం ఉండబోదు కనుక లారీలు, బస్సులు, భారీ ట్రక్కులు వంటి భారీ వాహనాలలో కూడా దీనిని ఏర్పాటు చేసినప్పుడే దేశంలో కాలుష్య నియంత్రణ సాధ్యం అవుతుంది. కనుక వాటికి కూడా దీనిని వర్తింపజేసినట్లయితే, వాటి ధరలు కనీసం లక్ష నుండి రెండు లక్షల వరకు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెపుతున్నారు.