ఆంధ్రప్రదేశ్లో కార్డుల విప్లవరం రాబోతోంది. మినిమం ఇంటికొకటి… ఇంకా అదృష్టవంతులైన.. తొమ్మిది కార్డుల వరకూ… రానున్నాయి. ఇవి ప్రజల దృష్టిలో కార్డులే కావొచ్చు కానీ.. ప్రభుత్వం దృష్టిలో రత్నాలు. జనవరి పదో తేదీలోపే.. ఈ కార్డులన్నీ ప్రజల చేతికి వస్తాయి. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. ఆ కార్డులందుకున్న వాళ్లంతా.. ప్రభుత్వానికే ఓట్లు వేయాలి. లేకపోతే.. ఆ కార్డు రత్నంగా కాదు.. నాలిక గీచుకుంటానికి కూడా పని చేయలేదు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి పంపుతూ… ఏపీ సర్కార్ నవశకం అనే పథకాన్ని ప్రారంభిస్తోంది.
ఆరు నెలల కాలంలో.. నవరత్నాలను కనీస స్థాయిలో అమలు చేయలేకపోయినప్పటికీ… ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో గరిష్టంగా లబ్ది పొందడానికి.. నవశకం పేరుతో కార్డులు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీని ప్రకారం.. ఒక్కో పథకానికి ఒక్కో కార్డు ఇస్తున్నారు. ఇలా ప్రతీ ఇంటికి …ఓ పథకం వెళ్లేలా కార్డులు పంపిణీ చేయబోతున్నారు. కానీ డబ్బులు ఇవ్వరు. కార్డుల పంపిణీ కాగానే… స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తారు. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి.. పథకం డబ్బులు ఇవ్వలేమని చెప్పి.. ఓట్లు వేయించుకుంటారు. కార్డులు పొందిన వారందరూ… వైసీపీకి ఓట్లు వేయకపోతే.. తమకు పథకాలు అందవేమోనన్న భయంతో.. ఓట్లు వేస్తారన్న వ్యూహాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నట్లుగా భావిస్తున్నారు.
నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో.. తెలుగుదేశం పార్టీ ఇదే వ్యూహాన్ని అమలు చేసింది. పసుపు – కుంకుమతో పాటు.. వివిధ పథకాల కింద..భారీగా ఓటర్లకు లబ్దిచేకూర్చింది. కానీ.. ఎవరూ.. పట్టించుకోలేదు. ఆయా పథకాల డబ్బులు తీసుకున్న వారు.. చంద్రబాబు సొంత డబ్బులు ఇస్తున్నారా.. అనే అభిప్రాయానికి వచ్చి..ఇష్టం వచ్చిన పార్టీకే ఓటు వేశారు. ఓ రకంగా.. అలా ఇవ్వడం మైనస్ అయింది. స్థానిక ఎన్నికల్లో అదే వ్యూహాన్ని అమలు చేయాలని.. జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిర్ణయించుకోవడం.. ఆసక్తికరంగా మారింది. ఇంకా విశేషం ఏమిటంటే.. ప్రజలకు ఏమీ ఇవ్వకుండా… కార్డులు మాత్రమే ఇచ్చి .. తర్వాత ఇస్తామని చెప్పడమే.. వైసీపీ సర్కార్ చేస్తోంది.