వైసీపీ నేతల పేకాట శిబిరాల రాజకీయం రోడ్డున పడింది. స్వయంగా మంత్రి గుమ్మనూరు జయరాం స్వగ్రామంలో అంతర్రాష్ట్ర పేకాట శిబిరాన్ని పోలీసులు పట్టుకున్నప్పుడు రాష్ట్రం అంతా నివ్వెరపోయింది. పోలీసులకు తెలియకుండా అంత పెద్ద శిబిరం నిర్వహించడం సాధ్యం కాదు. ఎక్కడో తేడా వచ్చి శిబిరాన్ని పోలీసులు మూయించారనేది టీడీపీ నేతల వాదన. అలాంటి శిబిరాలు ఒక్క మంత్రి స్వగ్రామంలో కాదని.. పలుకుబడి ఉన్న ప్రతీ వైసీపీ నేత కూడా.. తమ తమ ప్రాంతంలో ఈ శిబిరాలను నిర్వహిస్తూ.. చిన్నపాటి క్లబ్బుల మాదిరిగా చేసుకుని దందా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి వ్యవహారంలో వెలుగు చూస్తున్న విషయంలో సంచలనాత్మకం అవుతున్నాయి.
కొద్ది రోజుల కిందట.. రెయిన్ ట్రీ పార్క్‌లో నిర్వహిస్తున్న పేకాట క్లబ్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఆ శిబిరాన్ని నిర్వహిస్తోంది తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవినేనని ఆరోపణలు వెల్లువెత్తాయి. పట్టుబడిన వారు శ్రీదేవికి అనుచరులు కావడమే దీనికి కారణం. అయితే వారితో తనకు సంబంధం లేదని.. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించి నిరూపించుకున్నారు. కానీ అలా చేయడమే.. మొత్తం వ్యవహారం బయటకు రావడానికి కారణం అయింది. ఆమె పేకాట ఆడిద్దామని .. చెబుతున్న ఆడియోలను… నిందితులిద్దరూ విడుదల చేస్తున్నారు. దాంతో వైసీపీ వ్యవహారం బట్టబయలైపోయింది. మహిళా ఎమ్మెల్యేనే పేకాట శిబిరాల ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటే.. ఇతర ఎమ్మెల్యేలసంగతేమిటన్న చర్చ నడుస్తోంది.
వైసీపీ అంతర్గత రాజకీయాల కారణంగానే గుమ్మనూరు, తాడికొండ పేటక క్లబ్‌ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కానీ.. నియోజకవర్గాల్లో ఎలాంటి వర్గ పోరు లేని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. కొంత మంది నేతలు.. మండలానికి ఇంత అని మాట్లాడుకుని అప్పగించేస్తున్నారు. వారి వైపు పోలీసులు కన్నెత్తి చూడకుండా చేస్తున్నారు. ఫలితంగా ఇప్పుడు.. పేకాట క్లబ్‌లు కానిక్లబ్లు ఏపీ మొత్తం ఉన్నాయి. ఓ రకంగా అవే ఇప్పుడు ఏపీలో పెద్ద వ్యాపారంగా మారిపోయాయని చెబుతున్నారు. క్లబ్‌ల స్థాయిలో.. కోరుకున్న బ్రాండ్ మద్యం కూడా.. సరఫరా చేయడం.. వాటి ప్రత్యేకత అన్న ఆరోపణలు కూడా తీవ్ర స్థాయిలో వస్తున్నాయి.